తీవ్ర వివాదాస్పదమైన రుణ యాప్‌ల సృష్టికర్త చైనాకు చెందిన మహిళ అని విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది జనవరిలో భారత్ వచ్చిన ఆమె గురుగ్రామ్, దిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విస్తరించడంతో ఏప్రిల్‌లో తిరిగి చైనాకు వెళ్లిపోయి.. అక్కడి నుంచి రుణయాప్‌ల కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ బండారం బయటపడింది. అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక్కో రుణయాప్‌లో 20-30 వరకూ లింక్‌యాప్‌లు ఉన్నాయని గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీలో అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై గురువారం నగరానికి తీసుకువచ్చినట్లు సైబర్‌క్రైమ్ ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అరెస్టయిన ఆరుగురు నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సొమ్ము వసూలుకు ఎలాగైనా మాట్లాడుతారు...
రుణయాప్‌ల ద్వారా నగదు తీసుకున్నవారి నుంచి తిరిగి వసూలు చేసే బాధ్యత పూర్తిగా కాల్ సెంటర్లదే. రోజుకు రూ.20 కోట్లు వసూలు చేయాలనేది నిర్వాహకులు నిర్దేశించిన లక్ష్యం. ఒక్కో టెలీకాలర్ రోజూ కనీసం 60 మందికి ఫోన్ చేయాలి. సొమ్ము వసూలుకు ఎలా మాట్లాడినా ఇబ్బంది లేదని భరోసా ఇస్తారు. టెలీకాలర్లు అసభ్య పదజాలంతో దుర్బాషలాడుతూ రుణ గ్రహీతలను మానసికంగా హింసిస్తారు.
ఇదీ చదవండి: 'జర జాగ్రత్త... రాగల రెండు రోజులపాటు చలిగాలులు'