హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం రేపిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఎండీ సతీష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడే అతన్ని దారుణంగా హత్య చేసినట్టు తేల్చారు. ఇద్దరికీ ఒకే అమ్మాయితో ఉన్న సాన్నిహిత్యమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. తోటి ఉద్యోగినితో సాన్నిహిత్యంగా ఉండవద్దని చెప్పినందుకే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఉద్యోగమిచ్చినవాడినే చంపేశాడు
ప్రకాశం జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన సతీష్ బాబు... హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో నివసించేవాడు. అమీర్‌పేట్‌లోని క్యాపిటల్ ఇన్‌ఫో సొల్యూషన్స్ పేరిట సాఫ్ట్‌వేర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన అతని మిత్రుడు హేమంత్ సికింద్రాబాద్‌లోని అల్వాల్ వెంకటాపురంలో నివసించేవాడు. తనకు ఉద్యోగం కావాలంటూ హేమంత్... సతీష్‌ను సంప్రదించాడు. అతడి పరిస్థితిని అర్థం చేసుకుని హేమంత్‌ను తన సంస్థలో భాగస్వామిగా చేర్చుకుని... ప్రతి నెల 20 వేల రూపాయల వేతనం ఇచ్చేవాడు. అదే సంస్థలో పనిచేసే ప్రియాంక... సతీష్‌తో సన్నిహితంగా ఉండేది. సతీష్ కూకట్‌పల్లిలో మరో ఐటీ సంస్థను స్థాపించి ప్రియాంకను అక్కడికి బదిలీ చేశాడు. క్రమంగా హేమంత్... ప్రియాంకకు దగ్గరయ్యాడు. ఇది గమనించిన సతీష్ హేమంత్‌ను హెచ్చరించాడు. అతనికి ఇచ్చే వేతనంలో కూడా కోత విధించాడు.
పథకం ప్రకారమే...
తనను మందలించిన సతీశ్‌పై హేమంత్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే అతన్ని హత్య చేయాలని పథకం వేశాడు. ఈ నెల 28న వారిద్దరూ కలిసి హేమంత్ నివాసంలో మద్యం సేవించారు. అనంతరం యువతి విషయంలో గొడవపడ్డారు. విచక్షణ కోల్పోయిన హేమంత్ ఇనుస సుత్తితో సతీష్ తలపై మోదాడు. మృతదేహాన్ని కారులో తరలించి హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. మృతదేహాన్ని తరలించడానికి వీలు కాక అక్కడే వదిలేసి పరారయ్యాడు. సతీష్ కుటుంబసభ్యులు అతను కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి హంతకుడు హేమంతేనని తేల్చారు. పరారీలో ఉన్న నిందితుణ్ని ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. హేమంత్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హత్య కేసులో ప్రియాంక పాత్ర ఏమైనా ఉందా... ఇంకా ఎవరైనా సహకరించారా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి : మద్యంమత్తులో వివాహిత గొంతు కోసిన ఉన్మాది.. ఆ తర్వాత!?