Podu Lands Patta Distribution in Telangana : రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదేరోజున పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇటీవల సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎం.. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు జమ చేస్తుండటంతో నేటి నుంచి పట్టాలు పంపిణీ చేసి.. కొత్తగా పోడు పట్టాలు పొందిన గిరిజనులకూ రైతుబంధు వర్తింపజేయాలని అధికారులను గతంలో ఆదేశించారు.
Podu Lands Patta Distribution from june 30 : రాష్ట్రంలోని మిగతా అన్నదాతల మాదిరిగానే వీరికీ రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వమే పోడు పట్టాల యజమానులకు బ్యాంకు ఖాతా తెరిచి నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు. ఈ మేరకు కొత్తగా పోడుపట్టాలు పొందిన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలని స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి పట్టాల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం, అందుకు సంబంధించి శుక్రవారం, నేడు జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగతులు నిర్వహస్తుండటం, అదే సందర్భంలో ఈ నెల 29న బక్రీద్ పండుగ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీకి వాయిదా వేశారు. 30న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పలువురు గిరిజనులకు సీఎం స్వయంగా పట్టాలు అందించనున్నారు. అనంతరం ఆసిఫాబాద్‌లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఇవీ చూడండి..:
Podu Lands Patta Distribution : జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీ
పోడు రైతులకు శుభవార్త.. పట్టాల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?