PM Modi Telangana Tour Postponed: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 13న మోదీ రావాల్సి ఉండగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ నెలలో రాష్ట్రానికి ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది. ఈ నెల 11న అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. అదిలాబాద్, పెద్దపల్లి లేదా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంంగానే ఒక శక్తి కేంద్రంతో అమిత్ షా సమావేశమవుతారు. ఈ నెలాఖరున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రానున్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తుల వారితో సమావేశాలు: కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేసి సమావేశాలు నిర్వహించి.. జాతీయ నేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తుల వారితో సమావేశాలు నిర్వహించడంతోపాటు.. బడ్జెట్‌పై మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు.
స్థానిక భాషలో కరపత్రాల పంపిణీ: మార్కెట్ కేంద్రాలు, ట్రేడ్ సెంటర్లు, డాక్టర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, చార్టెడ్ అకౌంటెట్లు, లాయర్లు, వ్యాపార సంఘాలు, రైతు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించింది. పార్టీలో ఉండే ట్రేడర్స్ సెల్, డాక్టర్స్ సెల్, కిసాన్ మోర్చాలకు చెందిన నాయకులు.. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో చొరవ చూపాలని పేర్కొంది. ఈ క్రమంలోనే స్థానిక భాషలో కరపత్రాలు పంపిణీ చేయాలని తెలిపింది. సోషల్ మీడియాలో వీడియోలు రూపకల్పన.. వాటిని వైరల్ చేయడంపై కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.
కొద్ది రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు, దళితులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారని తెలిపారు. అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ నిత్యం ఎవరో ఒకరు పార్టీని వీడుతూనే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తరుణ్ చుగ్ పిలుపు నిచ్చారు.
ఇవీ చదవండి: బడ్జెట్ సమావేశాలపై నేడు సభాపతుల సమీక్ష
Union Budget 2023 : అమృత కాలపు బడ్జెట్.. నవభారతానికి బలమైన పునాది : మోదీ
నిరుద్యోగులకు నిర్మలమ్మ గుడ్‌న్యూస్.. 38,800 టీచర్ జాబ్స్ భర్తీ