తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా సంస్థలో పనిచేస్తున్న తమ పట్ల ఉన్నతాధికారులు వివక్షత చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు పేరిట తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వెలిబుచ్చారు. అధికారులు తమపై అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని గ్రామీణాభివృద్ధి కార్యాలయాన్ని సోషల్ ఆడిట్ బిఆర్పీ, డీఆర్పీ ఉద్యోగులు ముట్టడించారు.
పన్నెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా...
తమ సమస్యల పరిష్కారం కోసం కొందరు అధికారులు, డైరెక్టర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ ఉద్యోగి పెట్రోలు సీసాతో ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. గతంలో ఇదే కార్యాలయంలో ఈ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడనే సమాచారం మేరకు అతని బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు. పెట్రోల్ బాటల్ను గాంధీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత 12 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నా...నాటి నుంచి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
హామీ ఇస్తేనే విధులకు హాజరవుతాం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సంస్థ డైరెక్టర్ నుంచి స్పష్టమైన హామీ రాకపోయేసరికి వారు వెనుదిరిగారు. మూడు నెలలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పనిలోకి తీసుకోవాలని ఆ మేరకు హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని తేల్చి చెప్పారు. ఇందుకు డైరెక్టర్ అంగీకరించట్లేదని...ఉద్యోగులందరికీ ఒకే రకమైన నియమాలు వర్తింపచేయాలని వారు కోరారు. ఈ విషయంలో వెనుకంజ వేసేదే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఇవీ చూడండి : అరుదైన సంఘటన... 73 ఏళ్లకు గర్భం దాల్చిన వృద్ధురాలు