జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి సర్కారు బడుల్లోనూ మూడో సంవత్సరం నుంచే శిశు విద్యలో చేరొచ్చు. ఆ రకంగా ఒకటో తరగతికి ముందే ప్లే స్కూల్, ఎల్‌కేజీ, యూకేజీ చదవొచ్చు. ప్రస్తుతం ఈ విధానం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకూ అయిదేళ్ల వయసు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశం పొందడానికి వీలవుతుంది. కొత్త విద్యా విధానంలో శిశు/పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించినందున దాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాల విద్యకు సంబంధించి కొత్త విద్యా విధానంలో మొత్తం 294 అంశాలపై మార్పులు, చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు తుది నిర్ణయానికి రావాల్సి ఉంది.
10 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు
పూర్వ ప్రాథమిక విద్య, సిలబస్ మార్పు, 3-18 సంవత్సరాల వరకు నిర్బంధ ఉచిత విద్య, పరీక్షల్లో సంస్కరణలు తదితర వాటిని ఎప్పటిలోపు అమలు చేయాలో కేంద్రం ఇప్పటికే గడువు నిర్ణయించింది. ఈ అంశాలపై సంచాలకురాలు శ్రీదేవసేన పాఠశాల విద్యాశాఖలోని వివిధ విభాగాల అధిపతులతో తాజాగా 10 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. అంశాల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. మరోపక్క విద్యా హక్కు చట్టంలోనూ మార్పు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో దాదాపు 13 వేలకుపైగా అంగన్‌వాడీలు ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్నాయి. మరో 22 వేల వరకు విడిగా ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో పాఠశాల విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు రమణకుమార్, రమాదేవి తదితరులతో కమిటీని నియమించారు. త్వరలో ఆ కమిటీ సమావేశమై సిలబస్ తదితర అంశాలపై చర్చించనుంది.
మరో భేటీలో మరిన్ని అంశాలపై చర్చ
ఇంటర్ బోర్డూ పాఠశాల విద్యలో భాగం కావాల్సి ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇబ్బంది లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్యకు ప్రత్యేకంగా ఇంటర్‌బోర్డు ఉంది. అంటే ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ తరగతులకు అనుమతి ఇవ్వాలా? కళాశాలల్లో 9, 10 తరగతులు ఉండాలా? అన్న దానిపైనా చర్చించారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ), వయోజన విద్య, సార్వత్రిక విద్య, సమగ్ర శిక్షా అభియాన్ తదితర విభాగాలు చేయాల్సిన దానిపై పని విభజన చేశారు. అంశాల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో మరోసారి సమావేశమై మిగిలిన అంశాలపై చర్చించి పనివిభజన చేయనున్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే