రుణాల మంజూరులో కేవలం భాజపా పాలిత రాష్ట్రాలకే కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర అర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు.
ముద్రా రుణాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 28 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలు నిర్దేశించి చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన వారందరికీ ముద్రా పథకం కింద రుణాలు అందజేయాలని వినోద్ కుమార్ లేఖలో వివరించారు.
నిరుద్యోగులకు రుణాలివ్వాలి:
రాష్ట్రంలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వేలాది మందికి ముద్రా రుణాలు అందడం లేదని, నిరుద్యోగులను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని వినోద్ లేఖలో పేర్కొన్నారు. ముద్ర రుణాలు ఇచ్చేందుకు పలు బ్యాంకులు చొరవ చూపడం లేదని, కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో గతేడాది కేవలం 10.62 శాతం ముద్రా రుణాలు ఇచ్చారని.. దేశ సగటులో 17.86 శాతం మాత్రమై ఉందని లేఖలో వివరించారు. ముద్రా రుణాల మంజూరులో విస్తృతంగా ప్రచారం కల్పించి.. కనీసం రూ.10 లక్షలు ఇవ్వాలన్న ప్రాథమిక నిబంధనను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేవలం 40.9 లక్షల మందికే ఇచ్చారన్న ఆయన.. మిగిలిన వారికి తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు ముద్రా పథకం కింద వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి వివరించారు.