Ministers and MPs Delhi Tour: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు పలువురు పార్లమెంట్ సభ్యుల బృందం హస్తినకు వెళ్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో దిల్లీ వెళ్లిన మంత్రుల బృందం... కేంద్రమంత్రి, ప్రధానమంత్రితో భేటీకి యత్నాలు చేస్తున్నారు.
కానీ ఇంతవరకు రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ లభించలేదు. పీయూష్ గోయల్‌ను కలిసేందుకు పార్లమెంట్లో తెరాస ఎంపీలు సమయం కోరగా.. రేపు మధ్యాహ్నం కలుద్దామని ఎంపీలకు కేంద్రమంత్రి చెప్పారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీ వచ్చామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల సమస్యపై చర్చించేందుకు తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలన్నారు. రెండు రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం తమకు సమయం ఇవ్వలేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో తమను నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమేనని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు అనేది తెలంగాణకు చెందిన గంభీరమైన అంశమని.. ఈ అంశంలో తమకు ఇష్టమైనపుడే కలుస్తామనే భావన కేంద్ర ప్రభుత్వంలో ఉండటం సరికాదన్నారు. రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో లేదో స్పష్టం చేయాలన్నారు. దీనిపై నోటి మాట కాకుండా రాత పూర్వక హామీ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Ministers and MPs Delhi Tour: దిల్లీకి చేరుకున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం