ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యాజ్యాలపై విచారణ నవంబరు 15వ తేదీకి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే.గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఏపీ రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున భౌతికంగా విచారణ చేయడం కష్టమన్నారు.
దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయాన్ని హైకోర్టుకు వదిలేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. అందరి అభిప్రాయాలు విన్న న్యాయస్థానం.. విచారణను నవంబర్ 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మాత్రం కచ్చితంగా విచారణ కొనసాగిస్తామని స్పష్టంచేసింది.
'ఈ కేసులో వాదనలు ప్రారంభించాల్సిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది... వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన వాయిదా అడిగారు. అలాగే పిటిషనర్ న్యాయవాదులు కూడా భౌతికంగా ఈ కేసును వాదించాల్సిన అవసరం ఉందని... ఈ కేసు విషయంలో వేలల్లో పత్రాలు సమర్పించాల్సి ఉందని తెలిపారు. కరోనా రోజుల్లో అది అసాధ్యమని.. రాబేయే మూడు వారాలు కరోనా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని తెలిపారు. ఈ విషయాన్నిపరిగణలోకి తీసుకుని విచారణను వాయిదా వేయాలని కోరారు.'
- సుంకర రాజేంద్ర ప్రసాద్, హైకోర్టు న్యాయవాది
చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపి మే 3కు వాయిదా వేసింది. ఆ రోజు వ్యాజ్యాలు విచారణకు రాగా.. కొవిడ్ నేపథ్యంలో న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్టు 23కు ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు