ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నించిన దళిత రైతుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్‌ను ధాన్యం కొనుగోళ్లలో దళారులు మోసగించారు. విషయం అధికారులకు తెలియజేస్తే తిరిగి ఆ రైతుపైనే చీటింగ్ కేసు నమోదు చేశారు. దాంతో అతని తల్లి అచ్చమ్మ.. తెదేపా నేతలతో కలిసి డీఆర్ఓ రమణకు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు నిజాయితీపరుడని, విషయం తెలుసుకోకుండా అతనిపై దొంగతనం ముద్ర వేయడమేమిటని జైపాల్ తల్లి ప్రశ్నించింది. కేసులతో వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకుని చొక్కా పట్టుకుని పోలీసు స్టేషన్‌కు లాక్కెళ్లారని విలపించింది. తప్పు చేయకపోయినా దొంగతనం ముద్రపడిందని, కలెక్టర్ తమకు న్యాయం చేయాలని ఆ తల్లి వేడుకుంది.
కేసు పెట్టడం అన్యాయం
రైతు జైపాల్‌పై కేసు పెట్టి వేధించడం దారుణమని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఆ కేసు ఉపసంహరించుకోవాలని కోరారు. పాలకులు మారుతుంటారు కానీ అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దళారీలు.. రైతుల పొట్టకొడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోక పోగా వారిపైనే కేసులు వేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: పంచాయతీలపై విద్యుత్ దీపాల భారం!