Pest To Neem Tree: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాయలసీమలో తేయాకు దోమ వేపచెట్లకు భారీగా నష్టం చేసింది. అంతటితో ఆగకుండా తెలంగాణకూ వ్యాపించింది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు, అధిక వర్షపాతం వల్ల తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ దోమ స్వైర విహారం చేసింది. లక్షలాది వేపచెట్లను నాశనం చేసింది. ముందుగా ఈ దోమ వేపచెట్టు తలభాగంలో లేలేత కొమ్మలపై రంధ్రాలు చేస్తుంది. దాని నుంచి స్రవించే ద్రవపదార్థాలపై గాలిలో ఉండే వివిధ రకాల శిలీంద్ర బీజ కణాలు పడినపుడు అవి మొలకెత్తి శిలీంద్రాన్ని పెంపొందించి చెట్టు కొమ్మలను ఎండిపోయేలా చేస్తాయి. దీనివల్ల చెట్టు కొమ్మలన్నీ వెనక్కి ఎండిపోయి వెనువెంటనే ఆకులు రాలిపోతాయి. క్రమంగా చెట్టు చచ్చిపోతుంది. నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంది. వేలాది వేప చెట్లు ఈ దోమ కాటువల్ల చనిపోయాయి.
ఎక్కువ వయస్సుంటే అధిక వ్యాప్తి
సాధారణంగా ఎక్కువకాలం జీవించే వేపచెట్లను సైతం ఈ దోమ దెబ్బతీయడం వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరిపి అంతర్వాహిక శిలీంద్ర నాశిని, కీటక నాశినిలను పిచికారి చేస్తే సత్ఫలితాలు వస్తాయని సూచించారు. వేలాది వేప చెట్లు ఉన్న రామోజీ ఫిలింసిటీలో 25 సంవత్సరాల వయసున్న అనేక వేప వృక్షాల్లో 90 శాతం చెట్లు ఈ దోమకాటుకు గురయ్యాయి. దీని నివారణకు వీలున్న చెట్లకు రసాయనాలు పిచికారి చేసినా ఆ కీటక వ్యాప్తిని ఆపలేకపోయాయి. వేపలో వయస్సు ఎక్కువ ఉన్న చెట్లకు త్వరగానూ, తక్కువ వయస్సున్న చెట్లకు పరిమిత నష్టం జరిగింది. తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో తోటల్లో నీరిచ్చినప్పుడు చెట్లకు చిగురురావడం గమనించారు. ఆ విధంగా ఫిల్మింసిటీలో ఉన్న తోటలను పరిశీలించినపుడు వేరే మొక్కలతో పాటుగా వేప చెట్లకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్న చోట ఆకులు చిగురించడం గమనించారు. వెంటనే 3 రోజుల్లో 2,100 చెట్లకు పాదులు చేసి పుష్కలంగా నీటిని అందించారు. దోమ కాటుకు గురై కొమ్మలు ఎండిన చెట్లకు నీరు అందించిన 5వ రోజుకే 50 శాతం మొక్కలకు మళ్లీ చిగుళ్లు తొడిగాయి. రెండోసారి కూడా చెట్లకు నీరు అందిస్తున్నారు.
చిగురిస్తున్నాయి
ప్రస్తుతం ఆకు రాల్చే దశలో ఉన్న వేపచెట్లకు నీటిని అందించటం వల్ల రోగాలను అధిగమించి తొందరగా చిగురిస్తున్నాయని రామోజీ ఫిలింసిటీ ఉద్యాన విభాగం నిపుణులు గుర్తించారు. వేలాది వేపచెట్లకు నెలవైన రామోజీ ఫిలింసిటీలో ట్యాంకర్లు, ఫైర్ ఇంజిన్ల ద్వారా కూడా నీటిని అందించి వేపచెట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో నీటి లభ్యత ఉన్నచోట వేప చెట్లకు పుష్కలంగా నీరిచ్చినట్టయితే వాటిని చనిపోకుండా నివారించవచ్చు. త్వరత్వరగా అన్ని చెట్లు చిగురించడానికి వీలుంటుంది.
ఇదీ చదవండి: Cancer Screening: 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్