ఊరుకాని ఊళ్లో ఉండలేరు. లాక్‌డౌన్ కారణంగా సొంతింటికి చేరుకోలేరు. రోజులు వారాలవుతున్నాయి. ఇలా ఎన్నాళ్లుండాలో.. నిర్బంధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. వెరసి వివిధ కారణాలతో హైదరాబాద్ వచ్చినవారు.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పనిసరి అన్నది అందరూ అంగీకరించే విషయమే. అయితే నిబంధనలు పాటిస్తూనే అత్యవసర పనుల మీద వచ్చిన వారిని తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు అనుమతిస్తే ఉపశమనం కలుగుతుంది.
చిక్కుకున్నారిలా..
* అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్న యువకుడు 20 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన పాటించాడు. ఇది ముగిసిపోయి కూడా వారం కావస్తోంది. కానీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలంటే అనుమతి ఇవ్వడంలేదు. దాంతో ఇక్కడే బంధువుల ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నాడు.
* హైదరాబాద్‌కు చెందిన రీసెర్చి స్కాలరైన ఓ యువతి సిమ్లా వెళ్లింది. తిరిగి వచ్చేరోజే లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో విమానాలు రద్దయ్యాయి. అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. లాక్‌డౌన్ పొడిగిస్తారని వార్తలొస్తుండటంతో ఇక్కడ ఉన్న ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
* కాకినాడకు చెందిన ఓ కుటుంబం శుభకార్యం కోసం హైదరాబాద్ వచ్చింది. తిరిగి వెళ్లేలోపే లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచీ బంధువుల ఇంట్లోనే వారు కాలం వెళ్లబుచ్చుతున్నారు. కేవలం అత్యవసర పనుల మీద వెళ్లేవారికి మాత్రమే పాస్‌లు ఇస్తుండటంతో వీరు తిరిగి వెళ్లలేకపోతున్నారు.
* తమ దగ్గరి బంధువులు చనిపోవడంతో ఉయ్యూరుకు చెందిన 88 ఏళ్ల వృద్ధురాలు హైదరాబాద్‌లోని మౌలాలికి వచ్చారు. లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఈమె రోజుల తరబడి బంధువుల ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.
* పరీక్షలు రాస్తున్న తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు చెన్నైకి చెందిన దంపతులు తమ కార్లో హైదరాబాద్ వచ్చారు. తిరిగి వెళ్లాలనుకునే రోజే లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఇక్కడే చిక్కుకుని పోయారు. బంధువుల ఇళ్లలో కాలం గడుపుతున్నారు.
వివిధ పనుల నిమిత్తం వచ్చి రాష్ట్ర రాజధాని, ఇతర జిల్లాల్లో అనేక మంది చిక్కుకుపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వందలాది మంది హైదరాబాద్‌లో ఉండిపోయారు. రాష్ట్రానికి చెందిన అనేక మంది విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా మార్చి 22న దేశవ్యాప్తంగా స్వచ్ఛంద నిర్బంధం ప్రకటించినప్పుడు మర్నాడు వెళ్లవచ్చని భావించారు. అందుకే మార్చి 23న వేలాది మంది ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ప్రయత్నించడం, సరిహద్దుల్లో ఇబ్బందులు ఎదురవ్వడం తెలిసిందే. దాంతో ఎవరూ కాలు బయటపెట్టే సాహసం చేయడంలేదు.
పొడిగింపుతో ఆందోళన రెట్టింపు..
కరోనా తీవ్రత దృష్ట్యా వీరంతా బాధ్యతతోనే వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీకల్లా లాక్‌డౌన్ ఎత్తేస్తారని, అప్పుడైనా తిరిగి వెళ్లవచ్చని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు దీన్ని మరింతకాలం పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఆందోళన రెట్టింపైంది. అత్యవసర పనుల మీద వచ్చిన వారిని, నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసిన వారిని వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు అనుమతించాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉంటే పోలీసుశాఖ పరిమితంగా పాస్‌లు మంజూరు చేస్తోంది. సమీప బంధువులు చనిపోయినా, ఆరోగ్యం విషమంగా ఉన్నప్పుడు మాత్రమే సంబంధిత ఆధారాలు చూపితేనే ఈ పాస్‌లు ఇస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఆన్‌లైన్ చేశారు. యాదృచ్ఛికంగా చిక్కుకున్న తమలాంటి వారిని అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతైనా తిరిగి పంపేందుకు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి:- గృహ హింసపై ఫిర్యాదులపై వాట్సాప్ నంబర్