మకర సంక్రాంతి సంబురాలను ఊరువాడ వైభవంగా నిర్వహించుకున్నారు. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్ల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగ వల్లులు, గొబ్బెమ్మలు, జంగమ దేవరల జేగంటలు, ఢమరుకనాదాలూ సంక్రాంతి శోభను మరింత ఇనుమడింపజేశాయి.
పొంగలి వండిన గవర్నర్..
రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్ సిబ్బంది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్... పాలు పొంగించి.. పొంగలి వండారు. అంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాక్షించిన తమిళిసై.. టీకాలు వేసుకోవడం, రోగ నిరోధకశక్తి పెంచే ఆహారం తీసుకోవడం ద్వారా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. సంక్రాంతి వేళ ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో రంగురంగుల ముగ్గులు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో సంక్రాంతి పండగను సంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకున్నారు.
శిల్పారామంలో సంక్రాంతి శోభ..
హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామం.. సంక్రాంతి శోభతో అలరారుతోంది. పండుగ సందర్భంగా కుటుంబసమేతంగా నగరవాసులు తరలివచ్చారు. ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతోపాటు పడవలో షికారు చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు..శిల్పారామానికి వచ్చి తమ చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుచేసుకుంటున్నారు. పల్లె జీవన విధానం నేటి తరానికి తెలియజేయాలంటే శిల్పారామం రావాల్సిందే అని అంటున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో ప్రజానాట్యమంటలి ఆధ్వర్యంలో చిన్నారులు కోలాటం నిర్వహిస్తూ జానపద ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. బాలబాలికల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ముగ్గులు.. గొబ్బెమ్మలు..
సంక్రాంతి పురస్కరించుకుని పల్లెలు, పట్టణాలు తేడాలేకుండా వేకువజాము నుంచే మహిళలు... ఇంటి ముందు ముగ్గులు వేశారు. శీతల గాలులను లెక్క చేయకుండా పోటీ పడి... రంగవల్లులను తీర్చిదిద్దారు. ఏ కాలనీలో చూసినా ముగ్గులతో నిండిపోయింది. గొబ్బెమ్మలు పెడుతూ మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు.
ఇదీచూడండి: