జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు అందినంత దోచుకుంటున్నారనడానికి, అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారనడానికి ఇందిరా పార్క్ రోడ్డు నిదర్శనం. లాక్‌డౌన్ సమయంలో నగరంలోని అన్ని ప్రధాన రహదారులతో పాటు ఇంటీరియర్ రోడ్లలో లక్షల రూపాయలు వెచ్చించి బీటీ రోడ్లు వేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ రోడ్డులో 3 నెలల క్రితం లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు వేశారు. దీంతోపాటు ఇందిరా పార్క్ సబ్ స్టేషన్ రోడ్డులోనూ సీసీ రోడ్డు వేశారు.
3 నెలల వ్యవధిలోనే బీటీ రోడ్లను డిగ్గింగ్ చేయడంతో పాటు సీసీ రోడ్లు వేయడానికి ఆ రోడ్లను తవ్వారు. ఫలితంగా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తమ స్వలాభం కోసమే రోడ్లను తవ్వుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా చౌక్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే బైపాస్ రోడ్డులో అనేక గుంతలు ఏర్పడినా ఆ రోడ్డును బాగు చేయకుండా.. నాలుగైదు నెలల క్రితం కొత్తగా వేసిన బీటీ రోడ్డు తవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తవ్వగా వచ్చిన బీటీ రోడ్డు కుప్పలను రోడ్డుపైనే వదిలేస్తుండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో కొత్తగా వేసిన బీటీ రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.