Beggars at Traffic Signals in Hyderabad :హైదరాబాద్ మహా నగరంలో నానాటికీ జనాభా పెరుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వచ్చేవారు ఎక్కువ అవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలూ పెరుగుతున్నాయి. ఇక కరోనా తర్వాత ప్రజా రవాణాపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోయింది. అనేకమంది సొంత వాహనాల మీద ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Hijras at Traffic Signals in Hyderabad : సొంత వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు వాహనదారులకు ఇంకో చిత్రమైన చిక్కులు వచ్చి పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఆయా సిగ్నళ్ల దగ్గర వాహనాలు ఆపినప్పుడు భిక్షాటన చేసే వారు, హిజ్రాలు వచ్చి డబ్బులు అడుగుతూ వాహనదారులను ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలంటూ బలవంత పెడుతున్నారు. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు వారిని వదలటం లేదు. దీంతో అక్కడ వాహనాలు ఆపాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 334 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. దాదాపు అన్నింటి వద్దా ఇదే పరిస్థితి ఉంది. రెడ్ సిగ్నల్ పడగానే.. వాహనదారుల ముందుకు దూసుకువచ్చి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో భిక్షాటన చేసేవాళ్లు, హిజ్రాలు, బెలూన్లు, స్టీరింగ్ కవర్లు, వాహనాలు శుభ్రం చేసే ఇతర వస్తువులు అమ్మేవాళ్లు ఉంటున్నారు. కొన్ని సార్లు వాటిని కొనుగోలు చేయాలని బలవంత పెడుతున్నారు.
ఇలాంటి సమస్య నగరంలోని ప్రముఖ సిగ్నళ్ల దగ్గర ఎదురవుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ట్రాఫిక్ కూడలి వద్ద అధికంగా ఉంది. చిన్నపిల్లలు, చిరు వస్తువులు విక్రయించే వారు సడెన్ గా రావడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై గత ఏప్రిల్ లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమావేశం అయ్యారు. ఇలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని భావించారు. కానీ నెలలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు.
నగరంలో ఏదైనా అంతర్జాతీయ స్థాయి సమావేశం ఉన్నప్పుడు లేదా విదేశీ నాయకులు నగరానికి వచ్చినప్పుడు ఇలా సిగ్నళ్ల దగ్గర భిక్షాటన చేసేవారిని తీసుకెళ్లి తాత్కాలిక శరణాలయాలు, షెల్టర్లలో పెడతారు. అవి ముగిశాక పరిస్థితి షరా మామూలైపోతుంది. దీనిపై గతంలో కొందరు ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి వాళ్లు.. ఇలాంటి సమస్యలపై తమకు అధికారం ఉండదని.. సంబంధిత పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. తాము కేవలం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రోజు రోజుకీ పెరుగుతున్న ఈ సమస్యపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా సమావేశమై చర్చించాలని, తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. అలాంటి వారికి తగిన ఆశ్రయం కల్పించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.