Sound Pollution: వాహన తయారీ సంస్థ ఇచ్చినది కాకుండా డుగ్గు.. డుగ్గు.. అంటూ శబ్దం చేసే ఫ్యాన్సీ సైలెన్సర్లు.. గూబ గుయ్యిమనిపించేలా ప్రెషర్ హారన్లు.. సిగ్నల్ దగ్గర బండి వెళ్లడానికి అవకాశం లేకున్నా అదేపనిగా హారన్ కొట్టడం.. దీనికి తోడు డొక్కు బండ్ల రణగొణ ధ్వనులు, వేడుకలు, సభలు, సమావేశాల్లో భారీ లౌడ్ స్పీకర్లు.. వెరసి పరిమితి దాటుతున్న శబ్ద కాలుష్యం. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసుల్ని ధ్వని కాలుష్యం ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్దేశిత పరిమితులకు మించి శబ్దాలు వెలువడుతున్నాయి. నగరంలో 9 ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుండగా ఏ ఒక్కచోట నిర్దేశిత పరిమితిలోపు ఉండడం లేదు. అన్నిచోట్లా సగటున 5-10 డెసిబుల్స్ నమోదవుతోంది.
వాహనాలతోనే..
జూపార్కు, గచ్చిబౌలిలో సగటున 8-10 డెసిబుల్స్ అధికంగా నమోదవుతోంది. వాహనాలకు అదనపు హంగుల కోసం భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు, హారన్లు బిగించడం ప్రధాన కారణం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణను పట్టించుకోకపోవడం.. వ్యక్తిగత వాహనాలు కోటి దాటడం ఆందోళనకరం. వాణిజ్య, నివాసిత, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి శబ్ద కాలుష్యాన్ని లెక్కిస్తారు. జూబ్లీహిల్స్, తార్నాక, ఆబిడ్స్, జేఎన్‌టీయూ, ప్యారడైజ్, సనత్‌నగర్, జీడిమెట్ల, జూపార్క్, గచ్చిబౌలిలో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుంది.
రోడ్డు ప్రమాదాలకు కారణం
* శబ్ద కాలుష్యం కారణంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లకు ఏకాగ్రత లోపించి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. * మానసిక ప్రశాంతత లోపించి చిరాకు, ఆందోళనకు దారి తీస్తుంది. * పరిమితికి మించి శబ్దాలు వచ్చే ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటే రక్తపోటు పెరగడం, శాశ్వత వినికిడి లోపం, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
ఇదీ చూడండి: