గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మండల స్థాయిలో 'హాత్ సే హాత్ జోడో అభియాన్' సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 26న కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగుస్తుందని.. ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలోకి తీసుకువెళ్లి కేంద్ర, రాష్ట్ర సర్కార్ల వైఫల్యాలను ఎండగట్టాలని తెలిపారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మొదటగా సమావేశంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడగా.. రేవంత్ రెడ్డి పరిస్థితిని చక్కదిద్దారు. సమావేశంలో గొడవలు వద్దని సమావేశానికి సంబంధించినవి తప్ప ఇతర విషయాలు వద్దన్నారు. ఎజెండాకు లోబడే మాట్లాడాలని.. అందరూ ఓపిక పట్టాలని రేవంత్ కోరారు. ఈ క్రమంలోనే ఈ నెల 19లోపు రాష్ట్రస్థాయిలో సమావేశం జరగాలని ఏఐసీసీ చెప్పిందని.. ఈ నెల 20 నుంచి 24 వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని.. ధరణి సమస్యపై కూడా పోరాటం చేయాలన్నారు. వరంగల్‌లో విడుదల చేసిన రైతు డిక్లరేషన్ వివరించాలన్నారు.
అందరం కలసికట్టుగా ఉందాం..: ఎవరూ ఎవరి మనసును గాయపర్చవద్దని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని.. రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని సమావేశంలో వివరించారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా కలిసి ఉండి పని చేయాలన్నారు. కొత్తగా నియామకమైన వారు అందరినీ కలుపుకొని పని చేయాలని సూచించారు.
రాహుల్ నమ్మకాన్ని దెబ్బతీయొద్దు..: పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ములుగు ఎమ్మెల్యే సీతక్క సమావేశంలో తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి పని చేస్తామని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో రాహుల్‌తో కలిసి నడిచానని.. నేతలను మానసికంగా దెబ్బతీయవద్దని కోరారు. నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని రాహుల్ చెప్పారన్న సీతక్క.. రాహుల్ నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు.
ఇవీ చూడండి..
కాంగ్రెస్ కమిటీలకు 13 మంది సభ్యుల రాజీనామా
కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది: అనిల్