రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ వైపు పని చేస్తున్నారు.. ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారు.. మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నాయకత్వాన్ని కలుపుకుని అంశాల వారీగా పోరాటాలు చేయాల్సి ఉందని... ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ముఖ్యఅతిథులుగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇప్పటికీ పటిష్ఠంగా ఉందంటే క్షేత్ర స్థాయిలో డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషినే ఇందుకు కారణమన్నారు.
కాంగ్రెస్ పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని..2014, 18 అసెంబ్లీ ఎన్నికల ఓటమికి అనేక కారణాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని, కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి ఆస్కారం ఇస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో తెరాసకు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని, వాళ్లంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారన్నారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనన్న ఆయన.. తాను నిరంతరం అందుబాటులో ఉండి అండగా ఉంటానని డీసీసీ అధ్యక్షులకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని... కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని.. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలి: మంత్రి ఈటల