వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక కుటుంబ సభ్యులను పరామర్శ, 5లక్షల రూపాయల చెక్కును అందించేందుకు వెళ్తున్న పవన్‌కు పర్యటనలో అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఎల్బీనగర్ పరిధిలోని అల్కాపురి చౌరస్తాలో జనసేన కార్యకర్తలు, అభిమానులు.. పవన్‌ను పెద్ద పూలమాలతో సత్కరించారు.
రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అణగారిన వర్గాలకు, ఆడపడచులకు జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. యువతకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని... తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమరంలో జనసేన పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికిన ఎల్బీనగర్ జనసేన పార్టీ నాయకులకు, మహిళా విభాగ నాయకురాలు శిరీషా పొన్నూరికి ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్‌లో మీ అందరితో చర్చించి.. మీ అందరితో ఆలోచనలు చేసి.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అన్ని స్థానాల్లో పోరాటం చేద్దాం. మనందరం కూర్చొని చర్చించుకుని భవిష్యత్‌లో తెలంగాణలో జనసైన జెండా ఎగవేద్దాం. యువత, ఆడపడచులకు మీకు అండగా ఉంటా. తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన ఉంటుంది.
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇవీ చదవండి: