PAWAN ON PRC: ఏపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వెళ్లిందని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉద్యోగులకు ఊరట లభించలేదని చెప్పారు. ఫిట్మెంట్, గత హెచ్ఆర్ఏ కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసిందని తెలిపారు.
![Pawan On PRC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14386908_pk.jpg)
ఐఆర్,హెచ్ఆర్ఏ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీని పాక్షికంగా చేసినా సరే.... సమ్మె ఉపసంహరించుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించిందని దుయ్యబట్టారు. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని, వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకొంటుందన్నారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గం పట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుందని పవన్ తెలిపారు.
ఇదీ చూడండి: AP CM YS Jagan: 'కొవిడ్, ఆర్థిక పరిస్థితుల్లోనూ చేయగల్గినంత చేశాం'