తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచించాలని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి ఎన్నికలో భాజపా-జనసేన అభ్యర్థి రత్నప్రభ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. శంకరంబాడి కూడలిలో జనసేన-భాజపా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా అభ్యర్థి గెలిచినా దిల్లీలో ఇక్కడి సమస్యలు చెప్పలేరని పేర్కొన్నారు. ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఏం చేసింది? అని పవన్ ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం సామాన్యులపై ప్రతాపం చూపిస్తోంది. వైకాపా నేతలకు దమ్ముంటే వారి ప్రతాపం నాపై చూపించాలి. అధికారం బదలాయింపు జరగాల్సిందే. వైకాపాకు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు పోతాయని బెదిరిస్తున్నారు. జనం గుండెల్లో ఉన్న అభిమానం నాకు చాలు. సీఎం అయితే ప్రజలకు మరింత బాగా సేవ చేయవచ్చు. తిరుపతి నడిబొడ్డు నుంచి వైకాపాను హెచ్చరిస్తున్నా. ఇది నవతరం... చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తాం.
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
అంతకుముందు ఎమ్మార్‌పల్లి నుంచి పవన్ పాదయాత్ర చేశారు. అయితే కార్యకర్తలు, అభిమానుల రద్దీతో పాదయాత్ర ఆపేశారు. అన్నమయ్య కూడలి నుంచి శంకరంబాడి కూడలి వరకు వాహనం పైనుంచి అభివాదం చేస్తూ బహిరంగ సభకు చేరుకున్నారు.
ఇదీ చదవండి: వ్యవసాయంలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది: కేటీఆర్