A Young Man From Karimnagar has Secured Five Govt Jobs : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం రావడమే కష్టం. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లు జిల్లా గ్రంథాలయాన్నే గృహంగా మార్చుకున్నాడు ఆ యువకుడు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ చెందిన రాజశేఖర్ రావు. ఇన్ని ఉద్యోగాలెలా సాధించాడు? ఆ విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
ప్రస్తుతం ప్రభుత్వ కొలువు సాధించడమంటే యుద్ధమనే చెప్పాలి. ఎన్నో ఆటంకాలు ఏర్పడినా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యాడు ఈ యువకుడు. పోటీ పరీక్షలకు చదువుకునేందుకు పుస్తకాలు లేని సమయంలో జిల్లా గ్రాంథాలయాన్నే నివాసంగా చేసుకున్నా డు. పట్టుదలతో చదివి 5సర్కారీ కొలువులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కరీంనగర్‌కు చెందిన రాజశేఖర్ రావు ఎంఏ ఇంగ్లీష్, ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీలో 3 పీజీలు పూర్తి చేశాడు. తండ్రి వెంకట మల్లయ్య సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. సోదరుడు ఐలయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని గుణపాఠంగా తీసుకుని 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు రాజశేఖర్ రావు.
కృషి ఉంటే ఏ ఉద్యోగమైన సాధించవచ్చు : ప్రభుత్వ ఉద్యోగ సాధనలో సోదరుడు ఐలయ్య తనకు ఆదర్శం అంటున్నాడు రాజశేఖర్ రావు. పోటీ పరీక్షల సన్నద్ధతలో 2ఏళ్లు గ్రంథాలయానికే పరిమితమై కష్టపడి చదివి జేఎల్ కొలువు సాధించిన సోదరుడిని చూసి గర్వంగా ఉందని ఐలయ్య చెబుతున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి ఉద్యోగమైనా సాధించవచ్చు అంటున్నాడు.
లక్ష్య సాధనలో గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడిందని చెబుతున్నాడు రాజశేఖర్ రావు. చదువుకోవాలన్న వాతావరణంలో తోటి వారిని చూసి స్ఫూర్తి కలుగుతుందన్నాడు. కుటుంబసభ్యులతో పాటు స్నేహితులు సహాయపడ్డారని చెబుతున్నాడు.
కష్టాలను సోపానాలుగా చేసుకుని : ప్రభుత్వ కొలువు సాధించడానికి ముందు సర్వశిక్షా అభియాన్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించాడు రాజశేఖర్ రావు. ఆ పని చేస్తూ చదవడం సాధ్యం కాదని భావించి ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. రెండేళ్లు గ్రంథాలయానికి అంకితమై ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు చదువుకున్నాడు. జీవితంలో ఎదురైన కష్టాలను సోపానాలుగా మలుచుకుని విజయం సాధించానని చెబుతున్నాడు రాజశేఖర్ రావు.
పోటీ పరీక్షల్లో విఫలమైతే నిరాశకు గురికాకుండా లోపాలు ఎప్పటికప్పుడు సవరించుకుంటే ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నాడు రాజశేఖర్ రావు. తమ కుమారుడికి ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావడంతో రాజశేఖర్ రావు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే విజయం తథ్యమని నిరూపిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇలాంటి యువకులు.
YUVA : ఆనందాలు, ఆవిష్కరణలకు కేరాఫ్ 'అట్మాస్-2024' - వచ్చేసిందోచ్