రాష్ట్రంలో ఎన్నికలన్నీ పూర్తవడంవల్ల పరిపాలనా సంబంధిత అంశాలపై పూర్తిస్థాయిలో సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. స్థానిక పాలనను గాడిలో పెట్టడం సహా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం, బాధ్యత పెంచే దిశగా కార్యాచరణ చేపట్టారు. రెండు విడతలుగా అమలు చేసిన పల్లెప్రగతి ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు కదులుతున్నారు. గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు మనసు పెట్టిన చోట మంచి ఫలితాలు వచ్చాయని... పలు గ్రామాల్లో ఆశించిన మేర మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన గ్రామాల్లోనూ మార్పే ధ్యేయంగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు రాత్రి బస, పాదయాత్రలు చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. పల్లెప్రగతి స్ఫూర్తితో పట్టణప్రగతిని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.
పట్టణప్రగతికే ప్రాధాన్యం
స్థానిక పాలన సజావుగా సాగేలా పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లను నియమించారు. పట్టణ పాలనలో కీలక పాత్ర పోషించాల్సిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి రెండు మార్లు సమావేశమయ్యారు. మంత్రివర్గ సమావేశం, కలెక్టర్ల సదస్సు, పురపాలకసదస్సులో పూర్తిగా పట్టణ ప్రగతికే ప్రాధాన్యం ఇచ్చారు. నీరు, విద్యుత్ లాంటి సమస్యలు లేని పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉండే పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడంతో సమర్థ నిర్వహణ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియడం ద్వారా పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన.
జవాబుదారీతనం తీసుకొస్తే ప్రజలకు మెరుగ్గా సేవలు
పురపాలన అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తరుణంలో అవినీతిరహిత వ్యవస్థను తీసుకొచ్చి పారదర్శకవిధానాలు అమలు చేయడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తుందని... ఇందుకోసం అనుమతుల విషయంలో మానవ ప్రమేయం తగ్గించాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో పనిచేసే తత్వాన్ని అలవాటు చేయడం ద్వారా ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టినట్లవుతుందని... విధులు, బాధ్యతల ద్వారా జవాబుదారీతనం తీసుకొస్తే ప్రజలకు సేవలు మెరుగ్గా, సులువుగా అందుతాయని భావిస్తున్నారు. అవసరాలు గుర్తించి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఏడాది, ఐదేళ్ల కాలానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
అభివృద్ధిని చూపించాలనే ఉద్దేశంతో గజ్వేల్ పరిశీలన
కొత్త నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముందు నుంచే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భవిష్యత్ సవాళ్లను సులువుగా అధిగమించవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. కేవలం మాటలతోనే కాకుండా స్వయంగా కళ్లకు కట్టాలన్న ఉద్దేశంతోనే గజ్వేల్ పరిశీలనకు ప్రజాప్రతినిధులు, అధికారులను పంపారు. స్థానిక పాలనను మెరుగుపర్చి ఆయా ప్రాంతాల రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో పట్టణప్రగతి కార్యక్రమ అమలుకు సిద్ధమయ్యారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'