కొవిడ్ ప్రభావంతో కొన్ని నెలలుగా ఆన్లైన్ విచారణ నిర్వహిస్తున్న హైకోర్టు.. ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజూ ఒక ధర్మాసనం, మూడు సింగిల్ బెంచ్ లు ప్రత్యక్ష విచారణ జరుపుతాయి. ఆ రోజుల్లో మరో ధర్మాసనం, మిగతా సింగిల్ బెంచ్‌లు ఆన్లైన్లో విచారణ కొనసాగిస్తాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వారంలో రెండు రోజులు కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టనుంది. ఆగస్టు 8 వరకు మాత్రం హైకోర్టులో అన్ని కేసుల విచారణ ఆన్లైన్లోనే జరుగుతాయి.
ఆ రెండు జిల్లాల్లో
ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టులు, ట్రైబ్యునళ్లలో ఇప్పటికే ప్రారంభమైన పాక్షిక ప్రత్యక్ష విచారణ.. సెప్టెంబరు 9 వరకు కొనసాగనుంది. ఆ రెండు జిల్లాల్లో మాత్రం ఆగస్టు 8 వరకు ఆన్లైన్ విచారణలు కొనసాగించి.. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణ జరపాలని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు పాక్షిక ప్రత్యక్ష విచారణలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఉన్నత న్యాయస్థానం సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో వ్యాక్సిన్లు వేసుకున్న న్యాయవాదులకు మాత్రమే ప్రత్యక్ష వాదనలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రధాన ద్వారం వద్దే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా టీకా ధ్రువీకరణ పత్రాన్ని చూపించాలని.. లేదంటే ప్రత్యక్ష విచారణలు ఉపసంహరిస్తామని తెలిపింది. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే కోర్టులోకి వెళ్లాలని స్పష్టం చేసింది. న్యాయవాదులు, సిబ్బంది అందరూ కొవిడ్ నిబంధనలను తప్పనిసరి పాటించాలని పేర్కొంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: Bandi sanjay: 'మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోం'