SC ST Welfare Schemes in Telangana : రాష్ట్రంలో పలు దళిత సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి ఎందుకు ముందుకు వెళ్లడంలేదని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. కమిటీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ అధికారులతో హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను కమిటీ సమీక్షించింది. దళితులకు మూడెకరాలు భూమి పూర్తిగా అమలు కాలేదు.. దళితబంధు కూడా ఒక ప్రాంతానికే పరిమితైందని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
దీనిపై రాష్ట్ర అధికారులు మాట్లాడుతూ భూములు ధరలు బాగా పెరగడం.. వాటి లభ్యత తగ్గడం వంటి సమస్యలతో మూడెకరాల భూమి పథకం అమల్లో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.17 వేల కోట్లను ప్రతిపాదించినట్లు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల కేసుల పురోగతిని చర్చించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్సీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, కృష్ణయ్య, సర్వేశ్వర్‌రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.