BRS Parliamentary Meeting : ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బీఆర్ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. ఎంపీలతో జరిగిన ఈ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. జాతీయ పార్టీగా పార్లమెంటులో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
గవర్నర్ల తీరుపై గళం విప్పండి: రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరిచాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో జరిగిన భారాస పార్లమెంటరీ పార్టీ భేటీలో... పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని ఎంపీలకు తెలిపిన కేసీఆర్... దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంటులో గళం విప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పట్లాగే రాజీలేని పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంటులో గళం విప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పట్లాగే రాజీలేని పోరాటం చేయాలని పేర్కొన్నారు.
ప్రమాదకర ఆర్థిక విధానాలపై ఉభయసభల్లో గొంతెత్తండి: ప్రజల కష్టార్జితాన్ని మోదీ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెట్టుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నారన్నారు. కంపెనీల డొల్లతనం బయటపడి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతోందని ఎంపీలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర ఆర్థిక విధానాలపై ఉభయసభల్లో గొంతెత్తాలని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందన్నారు.
'రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న తీరుపై కేంద్రాన్ని నిలదీయాలి. గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎండగట్టాలి. కేబినెట్, అసెంబ్లీ, మండలి నిర్ణయాలను గవర్నర్లు పెండింగ్‌లో పెడుతున్నారు. గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలపై గళమెత్తాలి.'-సీఎం కేసీఆర్
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదీ వరకు సాగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందుంచుతారు. రెండో రోజైన ఫిబ్రవరి 1న 2023 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి సమర్పిస్తారు.
రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ తుది రూపు సంతరించుకుంటోంది. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుక దిల్లీలో గురువారం ఘనంగా జరిగింది. నార్త్ బ్లాక్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కిషన్ రావ్ కారాడ్, ఆ శాఖ సీనియర్ అధికారులు సైతం ఈ హల్వా వేడుకలో భాగమయ్యారు. బడ్జెట్ రూపకల్పనలో సహకరించిన అధికారులు, సిబ్బందికి మంత్రి నిర్మల సీతారామన్ హల్వా అందించారు.
ఇవీ చదవండి: