దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ విధానంలో పాఠాలు బోధించగా రాజస్థాన్ ప్రభుత్వం అక్కడ 30 శాతం ఫీజులు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడా అమలు చేస్తే లక్షలాది మంది తల్లిదండ్రులకు ఊరట లభిస్తుందని తల్లిదండ్రుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయంపై అక్కడి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 15 శాతం రుసుములు తగ్గించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలోనూ ఫీజులు తగ్గిస్తే దాదాపు 34 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే రాష్ట్రంలో 2019-20లో తీసుకున్న ట్యూషన్ ఫీజునే 2020-21లో వసూలు చేయాలని ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. అన్నిటికీ కలిపి ఒకటే రుసుముగా తీసుకుంటున్నందున ప్రత్యేకంగా ట్యూషన్ ఫీజు ఎంత అన్నది స్పష్టత లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదేశాల వల్ల దక్కిన ప్రయోజనం దాదాపు శూన్యమని తల్లిదండ్రుల సంఘాలు పేర్కొంటున్నాయి.
ఒక్క రూపాయి తగ్గించలేదన్న అసంతృప్తి
కొవిడ్ పరిస్థితులను చూస్తే వచ్చే విద్యా సంవత్సరానికి తరగతి గది బోధన కనీసం ఆగస్టు/సెప్టెంబరు వరకు ఉండకపోవచ్చని అంచనా. ప్రైవేట్ పాఠశాలలు జూన్ నుంచి ఆన్‌లైన్ పాఠాలను ప్రారంభించనున్నాయి. గతంలో పలు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు ఒక్క రూపాయి తగ్గించలేదన్న అసంతృప్తి, ఆగ్రహం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫీజుల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017లో ఇచ్చిన సిఫార్సులపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. తల్లిదండ్రులకు సుప్రీం తీర్పు ఊరటనిస్తుందని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ అభిప్రాయపడ్డారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాలలు రాయితీ ఇచ్చినా తల్లిదండ్రులు తమకు ఫీజులు చెల్లించలేదని చెప్పారు.
ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తాం
సుప్రీం తీర్పును ఇక్కడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. జూన్‌లోపే నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హెచ్‌ఎస్‌పీఏ తరఫున హైకోర్టుకు వెళ్తాం.
- వెంకట్, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్.
ఇదీ చూడండి: లాక్‌డౌన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు: సీఎస్