Palvai Sravanti Fire on Etela Rajender Comments: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వయి స్రవంతి తీవ్రంగా ఖండించారు. దొంగలు దోచుకుని పోయిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు ఈటెల ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమా లేక బీజేపీ చేసిన ఆరోపణలా అన్నది స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25 కోట్లు ఇస్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ చేతిలోనే పెట్టుకున్న బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయించలేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరికలు లేకపోవడంతో ఈటెల ఆవేదనతో ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైందని జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తనకు అనేక అవరోధాలు కల్పించారని ఆరోపించారు.
బీజేపీలో ప్రాధాన్యత లేకనే ఈ వ్యాఖ్యలు: కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొనుక్కోవడం వల్లే మునుగోడులో ఎన్నికలు వచ్చాయని.. అందుకు ఆ పార్టీకి మునుగోడు ప్రజలు బాగా బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. ఈటెల తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి దిగజారుడు రాజకీయ విమర్శలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారని.. అదే సమయానికి ఈటెల కూడా వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాకుంటే ఈటెల మానసిక స్థితి సరిగ్గా లేదని లేక బీజేపీలో ప్రాధాన్యత లేక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని భావించాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించి ఈటెల రాజేందర్ భ్యాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రావాలని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. లేదంటే తాను చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఒప్పుకోవాలని పేర్కొన్నారు. లెఫ్ట్ భావజాలం కలిగిన ఈటెల బీజేపీలో ఎలా చేరారని ప్రశ్నించారు. అమిత్ షాను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ఎవరి విమానంలో ఈటెల వెళ్లారో తెలియదా అని నిలదీశారు. కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈటెల బీజేపీలో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ బలం తగ్గించేందుకు కేసీఆర్, ఈటెల వ్యూహం పన్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అవగాహన ఒప్పందంలో భాగంగానే ఈటెలపై కేసీఆర్ బలహీన వ్యక్తిని పోటీలో పెట్టారని విమర్శించారు.
ఇవీ చదవండి:
Congress VS BJP: కాంగ్రెస్, బీజేపీ 'కోట్ల' కొట్లాట.. దొందు దొందేనన్న బీఆర్ఎస్
Revanth Reddy: 'కాస్కో ఈటల.. రేపు గుడిలో ప్రమాణం చేసి చూపిస్తా'
Etala Rajender: 'మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రేవంత్ డబ్బు తీసుకున్నారు'