Palle Pragathi Celebrations In Telangana : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అమలు కావటంలేదని.. అది ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే సాధ్యమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చర్లబుత్కూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంలో పల్లె ప్రగతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, కలెక్టర్ శశాంక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ భవన నిర్మాణ పనులకు సత్యవతి రాఠోడ్ శంకుస్థాపన చేశారు.
దేశంలోనే తెలంగాణ.. అభివృద్ధికి చిరునామగా మారిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగాపురంలో పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసి.. కార్మికులను శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. భద్రాచలంలో కలెక్టర్ అనుదీప్ పంచాయతీ కార్మికులకు శానిటేషన్ వస్త్రాలను పంపిణీ చేసి.. శాలువాలతో సత్కరించారు.
Telangana Decade Celebrations : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, జెండాను ఆవిష్కరించారు. ర్యాలీగా వెళ్లి మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో సపాయి కార్మికులను సత్కరించారు. తెలంగాణ రాక ముందు వచ్చాక రాష్ట్రంలో ఏవిధమైన పరిస్థితులు ఉన్నాయో ప్రజలు గమనించాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి పరిశుభ్రత, స్వచ్ఛతే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు.
Palle Pragathi Celebrations In Telangana : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి గుండాలను దత్తత తీసుకుంటున్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సుద్దాల గ్రామంలో బిక్కేరు వాగుపై 14.5 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామపంచాయతీలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే నేడు పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో చిన్న చిన్న గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారని.. తద్వారా గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణలోని అనేక గ్రామాలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నాయని నల్లమోతు భాస్కర్‌రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: