Palla Rajeshwar Reddy Fires on Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నిన్న జరిగిన సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. కానీ ప్రధాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబంపై అవాకులు చవాకులు మాట్లాడారని మండిపడ్డారు. బోయిన్‌పల్లిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రధాని మోదీ నిన్న జరిగిన సభలో ఎంఎంటీఎస్, రైల్వేస్టేషన్, ఓఆర్ఆర్, మెట్రోను కేంద్రం ఇచ్చిందని చెబుతున్నా.. ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న పై వంతెన ఇప్పటివరకు పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు, ప్లై ఓవర్లు, మల్టీ స్పెషల్ ఆస్పుత్రుల నిర్మాణంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతిని సాధించామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని.. రాష్ట్రప్రభుత్వాన్ని అవినీతి పాలనగా మోదీ మాట్లాడటం సరి కాదని దుయ్యబట్టారు. కేంద్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను త్వరలోనే తాము ఎండగడతామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.
మోదీకి కేటీఆర్ సవాల్: మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ట్విటర్ వేదికగా స్పందించారు. గడిచిన 9 సంవత్సరాలలో తెలంగాణతో సమానంగా వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపాలని ప్రధానికి సవాల్ విసిరారు. దేశంలోనే తెలంగాణ అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రమని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయటంతో పాటు.. దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్ ప్లస్‌ని సాధించామని కేటీఆర్ వెల్లడించారు.
ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదని కేటీఆర్ వివరించారు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారన్నారంటూ ఆయన ఆక్షేపించారు. మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగంపై నిన్న బీఆర్ఎస్ మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా మోదీ ఆరోపణలు చేయడాన్ని వారు తప్పుబట్టారు. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకపోయినా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు మంత్రులు వెల్లడించారు.
ఇవీ చదవండి: 'అదానీ వాదంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు.. లేని పరివార వాదంపై ప్రధాని మాటలు'
ప్రధాని మోదీ కేవలం రాజకీయాల కోసమే హైదరాబాద్ వచ్చారు: కేటీఆర్