palla comments: కేంద్రంలో రైతు వ్యతిరేక భాజపా ప్రభుత్వం దిగిపోయే వరకూ తెరాస పోరాటం కొనసాగుతుందని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో వరిధాన్యం కొనే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామన్నారు. భాజపా వ్యతిరేక కూటముల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రగతి నిరోధకుల్లా తయారయ్యారన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి, భాజపా నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొన్నాళ్లు... రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం పంపించిన గవర్నర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి.. ప్రభుత్వాన్ని అభినందించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు వ్యవసాయాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిందన్నారు. ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసే కుట్రను వ్యతిరేకిస్తున్నామన్నారు. భాజపాను, కేంద్రంలో సర్కారును రైతులు తరిమి కొట్టాలన్నారు.
కేంద్రం కుట్రను వ్యతిరేకిస్తున్నాం..
సాలీనా రూ.1450కోట్లు ఎల్ఐసీకి ప్రీమియం కడుతున్నాం. ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి. గవర్నర్ను పంపించి కూడా చెక్ చేసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పారు. బాయిల్డ్ రైస్ ఒక్క కిలో కూడా తీసుకోమని ఎఫ్సీఐ ద్వారా లేఖ రాయించారు. మేము వారి దగ్గరికి వెళ్లిన ఒక్క కిలో ఉప్పుడు బియ్యం కొనమన్నారు. మళ్లీ ఇప్పుడు పార్లమెంట్లో అబద్ధాలు చెప్పారు.
-పల్లా రాజేశ్వర్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు
ఇదీ చదవండి:
Gangula review on paddy procurement: 'ధాన్యం డబ్బులు చెల్లింపులకు నిధుల కొరత లేదు'