కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వడంపై డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని తెరాసకేవీ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి.. అసోసియేషన్ ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు అవినీతికి తావు లేకుండా రెవెన్యూ సేవలు అందుతాయని వారు అభిప్రాయపడ్డారు.
సుదీర్ఘ పోరాటం చేసిన వీఆర్ఏ సమస్యల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి.. వారిని రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని కట్టుబడి ఉండటం శుభ పరిణామమని తెరాసకేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. వీఆర్ఏ జీవితాల్లో వెలుగునింపిన సీఎం ఆదేశాలను వారు తప్పకుండా పాటిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్