నయీం కేసులో స్వాధీనం చేసుకున్న డైరీలలో ఉన్న సమాచారాన్ని బయటపెట్టాలని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి(padmanabha reddy) గవర్నర్‌ను కోరారు. నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా... పురోగతి లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(tamilisai soundararajan)కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
గ్యాంగ్ స్టర్ నయీంను 8 ఆగస్టు 2016లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ సందర్భంలో పోలీసులు నయీం ఇళ్లల్లో సోదాలు చేసి... 130 డైరీలు, 602 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని.. ఆయన గవర్నర్‌కు వివరించారు. నయీం పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో సత్సబంధాలు కొనసాగించాడని తెలిపారు.
వారి సహయంతో నయీం నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నారు. నయీం అమాయకుల భూములు కూడా ఆక్రమించాడని చెప్పారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రధాని కార్యాలయం సైతం ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని సూచించినా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిగణలోకి తీసుకోవడం లేదని గవర్నర్(tamilisai soundararajan)కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కనీసం డైరీలో ఉన్న విషయాలను బయటపెట్టినా... నయీంతో దాందా చేసిన వారిపేర్లు బయటకు వస్తాయని పద్మనాభరెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: etala resign: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా