OTT Subscription Cyber Frauds in Hyderabad : తక్కువ ధరకే వివిధ ఓటీటీల సభ్యత్వం, ఉచితంగా అపరిమిత కంటెంట్, సభ్యత్వం పునరుద్ధరిస్తామంటూ ఆన్‌లైన్‌లో నకిలీ ప్రకటనలు, ఈ-మెయిళ్లు, తప్పుడు సందేశాలతో సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) లక్షల్లో దోచేస్తున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లో అడ్డగోలు ప్రకటనలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, యువత, గృహిణులు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Low Cost OTT Subscription Cyber Frauds : కొవిడ్ తర్వాత అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్ తదితర ఓటీటీల వినియోగం విస్తృతంగా పెరిగింది. ప్రకటనలు లేకుండా(యాడ్ ఫ్రీ), ఒకేసారి ఎక్కువ తెరపై కంటెంట్ చూసేందుకు ప్రత్యేకంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి కొన్ని ఓటీటీ సంస్థలు. నెలవారీ సభ్యత్వానికి బదులు, వార్షిక చందా తీసుకుంటే ధర తగ్గిస్తున్నాయి మరికొన్ని సంస్థలు. సైబర్ నేరగాళ్లు అచ్చం ఇలాంటి ఆఫర్లతోనే మోసాలకు తెరతీస్తున్నారు. సాధారణంగా ఓటీటీ సంస్థలు.. నెలవారీ, వార్షిక సభ్యత్వ గడువు ముగిస్తే పునరుద్ధరించుకోవడానికి ఖాతాలో రిజిస్టర్ చేసిన ఈమెయిల్‌కు సందేశం పంపిస్తాయి. అచ్చం సైబర్ ముఠాలు కూడా ఇదే పనిచేసి బోల్తా కొట్టిస్తున్నాయి.
OTT Subscription Cyber Crimes Hyderabad : తక్కువ ధరకు ఖాతా తీసుకోవాలనో లేక.. సభ్యత్వం పునరుద్ధరించుకోవాలనో ఓ ప్రకటన రూపొందించి.. చెల్లించాల్సిన సొమ్ము వివరాలతో ఈ మెయిల్‌కి సందేశం పంపిస్తారు. ఈ లింకుపై క్లిక్ చేశాక అచ్చం ఓటీటీ చెల్లింపుల తరహాలోనే బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లు, రహస్య పిన్ నమోదు చేసే వ్యవస్థలుంటాయి. ఈ వివరాలు నమోదు చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బంతా క్షణాల్లో మాయమవుతుంది. నేరగాళ్లు ఈ డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తారు. ఈ తరహా మోసాల్లో తక్కువ మొత్తాల్లో డబ్బు పోగొట్టుకున్న ఖాతాదారులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగేస్తున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న వారు మాత్రమే సంప్రదిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి మాదాపూర్‌లోని సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ సభ్యత్వం(OTT Subscription) తక్కువ ధరకే వస్తోందనే ప్రకటన చూసి క్లిక్ చేశాడు. వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నమోదు చేయగానే రూ.90 వేలు బదిలీ అయినట్లు సందేశం వచ్చింది. విద్యానగర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగికి మెయిల్ వచ్చింది. ఒక రూ.500 తక్కువకు వస్తోందని మెయిల్‌లో ఉంది. పేరు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసిన కొద్ది క్షణాల్లో ఖాతాలోని రూ.14 వేలు విత్‌డ్రా అయినట్లు సందేశం వచ్చింది. తెలిసిన వారి ద్వారా ఆరాతీయగా మోసమని తేలింది.
ఇలా నేరగాళ్లు మోసం చేసేందుకు గూగుల్ అల్గారిథమ్ వ్యవస్థ కూడా ఓ కారణమవుతోంది. ఆన్‌లైన్‌లో ఓటీటీ సభ్యత్వ రుసుములు, ఇతర వివరాల గురించి శోధించినప్పుడు.. అదే అంశానికి సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. ఇందులోనే సైబర్ నేరగాళ్లు రూపొందించిన నకిలీ ప్రకటనలు వస్తాయి. తక్కువ ధరకు ఆకర్షితులయ్యే కొందరు ప్రకటనల్ని క్లిక్ చేసి నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు.
Cyber criminals cheated young woman : జాబ్ ఆఫర్ అంటూ నిండా ముంచేశారు..
ఈ మెయిళ్లకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారు. ఇదొక రకమైతే.. అపరిమిత కంటెంట్ పేరుతో థర్డ్‌పార్టీ యాప్‌లు ప్రజల వ్యక్తిగత డేటా కొట్టేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆఫర్ల పేరుతో పంపించే సందేశాల్లో ఏపీకే ఫైల్స్ ఉంటాయి. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వారు రూపొందించిన కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ అవుతాయి. వాస్తవానికి ఇలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ ప్రమాదమంటూ హెచ్చరించే వ్యవస్థలు స్మార్ట్‌ఫోన్లలో ఉంటాయి. కొందరు నిర్లక్ష్యంతో.. తమ ఫోన్లో ఏం ఉంటుందన్న ఆలోచనతో యథాతథంగా డౌన్‌లోడ్ చేస్తారు. ఈ యాప్‌లు ఫోన్లలోని అన్ని యాప్‌ల సమాచారాన్ని సేకరిస్తాయి. ఓటీటీ సభ్యత్వం తీసుకోవాలన్నా.. పునరుద్ధించుకోవాలన్నా ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలు, మెయిళ్లు, సందేశాలను నమ్మవద్దని.. ఓటీటీ యాప్, వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని సూచించారు. ఉచితంగా అపరిమిత కంటెంట్ చూడొచ్చని వచ్చే సందేశాల్ని నమ్మి థర్డ్‌పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.