జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి తెరాస, భాజపా వ్యతిరేక పక్షాలతో ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth reddy) వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తామని తెలిపారు. ఇవాళ గాంధీభవన్‌లో తెరాస, భాజపాయేతర ప్రతిపక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 22న మహాధర్నా
పోడు భూముల సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన తెరాస, భాజపాయేతర పక్షాలతో కలిసి ఇందిరాపార్కు వద్ద మహాధర్నా(maha dharna) నిర్వహించనున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ నెల 27న భారత్ బంద్‌ను(Bharat bandh) విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందిరాపార్కు(Indira Park) వద్ద మహాధర్నా తర్వాత భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్లమెంటరీ వారిగా కమిటీలు వేసుకుని సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ నెల 30న అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. వచ్చే నెల 5న పోడుభూముల సమస్యలపై ఆదిలాబాద్ నుంచి ఆశ్వారావుపేట వరకు రాస్తోరోకో నిర్వహిస్తాని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్ర సర్కారు మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. పోడు భూములపై విజయం సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ మళ్లీ దళిత బంధు అంటూ మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రోల్ ధరలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఏడేళ్ల కాలంలో వేలాది ఎకరాల భూమిని కేసీఆర్ సర్కారు లాక్కుందని కోదండరామ్ ఆరోపించారు. ఈ వరుస కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అయన వివరించారు.
దేశవ్యాప్తంగా సుంకాలు కేంద్రం పెంచి ఇంధన ధరలు పెంచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు. ఈనెల 22న మహాధర్నా, 27 భారత్ బంద్‌కు తాము మద్దతిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
భాజపా, తెరాసయేతర వర్గాలన్నీ కలిసి ఈనెల 22న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ధరణి, భూ నిర్వాసితుల సమస్యలు, పోడు భూముల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ మహా ధర్నా చేపడుతున్నాం. వచ్చే నెల 5 వ తేదీన పోడు భూములపై రాస్తారోకో కార్యక్రమాన్ని అశ్వారావుపేట నుంచి చేపట్టాలని సమావేశంలో తీర్మానించాం. 30 తేదీన కలెక్టరేట్లలో వినతి పత్రాలు సమర్పించునున్నాం. ఈనెల 27న జరగనున్న భారత్ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఈనెల 22న మహాధర్నా, 27 భారత్ బంద్, 5న రాస్తారోకోను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలి. అలాగే కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. రాష్ట్రంలో ప్రధానంగా భూముల సమస్య ఉంది. విచ్చలవిడిగా బలవంతంగా పేద ప్రజల నుంచి భూములు లాక్కుంటున్నారు. దీనిపై పోరాటం కొనసాగిస్తాం.
- కోదండరామ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు
కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. గత ఏడేళ్లుగా మోదీ ప్రభుత్వం నిరంకుశ చట్టాలు తీసుకొస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం, పెట్రోల్ ధరలు పెంచి కేంద్రం విఫలమైంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఇస్తామని మాట తప్పింది. పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పోడు భూముల సమస్యలపై పోరాడేందుకు మేం నిర్ణయించాం. ఇప్పటికే కేసీఆర్ పోడు భూములపై ఓ కమిటీ వేశారు. అయినా మా పోరాటం ఆగదు.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
దేశవ్యాప్తంగా సుంకాలు పెంచి ఇంధన ధరలు పెంచారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదవారి నడ్డి విరుస్తున్నారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం విధానాలపై పోరాడతాం. ఈనెల 22న మహాధర్నా, 27 భారత్ బంద్‌కు తాము మద్దతిస్తున్నాం. అన్ని జిల్లాల్లో భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇదీ చూడండి: Congress: అధికారంలోకి రాగానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు: మల్లికార్జున ఖర్గే