ఒకవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరిన దాదాపు లక్ష మంది విద్యార్థులు టీవీ పాఠాలు ఎప్పుడు మొదలవుతాయా అని చూస్తున్నారు. ప్రవేశాలు ఇంకా జరుగుతున్నందున అవి పూర్తయిన తర్వాత మొదలవుతాయని అధ్యాపకులూ భావిస్తూ వచ్చారు. మరో వైపు ఇంటర్ విద్యాశాఖ మాత్రం చడీచప్పుడు లేకుండా సోమవారం మధ్యాహ్నం నుంచి దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠాలను ప్రసారం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు కాలపట్టికను వెల్లడించారు.
కనీసం ఒకటి రెండు రోజుల ముందయినా ఆన్‌లైన్ పాఠాల ప్రారంభ తేదీని చెప్పకపోవడంపై అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా చెప్పకపోవడంతో విద్యార్థులు మొదటి రోజు పాఠాలను వినలేకపోయారు. చూస్తే చూశారు... లేకుంటే లేదన్న భావన అధికారుల్లో ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని కొందరు అధ్యాపకులు వ్యాఖ్యానించారు.
‘ఇంటర్ విద్యాశాఖలో హడావిడి నిర్ణయాలు ఎక్కువవుతున్నాయి... విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా తెలియజేయకుంటే పిల్లలు నష్టపోతారు’ అని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ వ్యాఖ్యానించారు. ‘టీవీ పాఠాలు ప్రారంభించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాకపోతే ముందుగా చెప్పి ఉంటే విద్యార్థులను అప్రమత్తం చేయడానికి వీలుండేది’ అని తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి (టిప్స్) కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ అభిప్రాయపడ్డారు.
ప్రవేశాల గడువు మరోసారి పొడిగింపు
రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుండగా దాన్ని ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ విద్యతో.. మసకబారుతున్న సృజన!