ఉల్లి కోస్తేనే కాదు.. కొనాలన్నా సామాన్యులకు కంటనీరు తెప్పిస్తోంది. రోజూ ఉపయోగించే ఉల్లి ధర 50 నుంచి 60 రుపాయల చొప్పున అమ్ముతున్నారని ప్రజలు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెచ్చిన సరుకు ధర 42 రుపాయలు కాగా.. తెలుగు రాష్ట్రాల నుంచి తెచ్చినవాటి ధర రూ. 32 పలుకుతోంది. మంగళవారం 42 వేల బస్తాలు మలక్‌పేట మార్కెట్ యార్డుకు రాగా చకచకా అమ్ముడుపోయింది. చిల్లర మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
తగ్గిన సాగు విస్తీర్ణం, దిగుబడి...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణం 13,247 ఎకరాలకు 9,987 ఎకరాల్లో ఉల్లి పంట సాగైంది. దేశంలో అత్యధికంగా ఉల్లిని సాగు చేసే మహారాష్ట్రలో గత రెండు సీజన్ల నుంచి వాతావరణం అనుకూలంగా లేనందున సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో అధిక వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు.
పండుగ సీజన్‌లో కృత్రిమ కొత...
వినాయక చవితి మొదులుకుని దసరా, బతుకమ్మ, సంక్రాంతి వరకు పండుగల సీజన్‌లో కొరత ఏర్పడితే... ధరలు పెంచవచ్చనేది వ్యాపారుల వ్యూహం. ఉల్లిగడ్డల నిల్వలపై పరిమితి పెట్టాలని తాజాగా కేంద్రం యోచిస్తోంది. ఎక్కువ నిల్వలు పెట్టి కొందరు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. గోదాముల తనిఖీలో ఉల్లి నిల్వలపై నియంత్రించాలని కసరత్తు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే కనిష్ఠ ధరను సైతం టన్నుకు 850 డాలర్లకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
మహారాష్ట్ర నుంచి కొత్త ఉల్లి పంట వచ్చే నెలల్లో మార్కెట్‌కు వస్తుందని అప్పటికల్లా ధరలు మరింత తగ్గుతాయని మార్కెటింగ్, అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండిః ఉల్లికి రెక్కలు.. రికార్డు స్థాయిలో ధరలు