TSPSC Paper Leakage Case One Person Arrest : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మాస్ కాపీయింగ్ చేయించిన రమేష్‌కు పేపర్ ఇచ్చిన ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టోలీచౌకీకి చెందిన మహబూబ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన మహబూబ్ ప్రైవేటు కళాశాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనితో ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 52 మందిని అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు.
ఎగ్జామ్ హాల్‌లో ప్రశ్నపత్రం ఇచ్చింది మహబూబ్‌నే : ఎగ్జామ్ హాల్‌లో ఎక్కడు కూర్చోవాలో.. ప్రశ్నపత్రాలు ఎలా పొందాలో టోలీచౌకీలో నివసించే ఇప్పుడు పట్టుబడిన నిందితుడు మహబూబ్ ఈ వివరాలను ఇచ్చాడు. ఇతడు ఒక ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహించేవాడు. ఈ మొత్తం ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి రమేష్‌తో మహబూబ్ పెద్ద మొత్తంలోనే డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు తర్వాత మహబూబ్ కనిపించకుండా పోయాడు.. అతనికోసం సిట్ బృందాలు గాలించాయి. ఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన సూత్రధారుడు రమేశ్‌నే అని సిట్ బృందాలు తెలుపుతున్నాయి.
TSPSC Paper Leakage Case Update : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో 52 మందిని అరెస్టు చేశారు. అయితే అంతకు ముందు ఈ కేసుకు సంబంధించిన అభియోగపత్రాలలో.. దాదాపు 37 మంది నిందితుల పేర్లను చేర్చింది. దీని కోసం న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అందులో న్యూజిలాండ్‌లో ఉంటున్న ప్రశాంత్‌రెడ్డి మినహా, మిగిలిన అందరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
అయితే ఈ 37 మందిలో 15 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మిగిలిన వారు జ్యూడిషియల్ ఖైదీలుగానే ఉన్నారు. ఈ కేసులో ప్రధానమైన పూల రమేశ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇతగాడు నిందితులతో పరీక్ష హాలులో హైటెక్ మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో నేర్పించాడు. పూల రమేశ్ దాదాపు 80 మందికి ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు సిట్ బృందం భావిస్తోంది.
సీబీఐ విచారణ అవసరమా : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు.. ఇంకా సీబీఐకు ఎందుకు బదిలీ చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణ చేపట్టిన కోర్టు.. ఈమేరకు ఇలా స్పందించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా చురుగ్గానే జరుగుతోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. నిందితుల్లో 37 మందిపై ఛార్జిషీట్ వేసినట్లు కూడా కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి :