రాష్ట్రంలో పుర ఎన్నికలకు సంబంధించిన వివాదాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను చట్ట విరుద్ధంగా కుదించారని, వార్డుల విభజన సరిగా జరగలేదంటూ నిర్మల్ జిల్లాకు చెందిన అంజుకుమార్ రెడ్డి, భాజపా నేత మల్లారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇటీవల ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసింది. ఎన్నికల ఏర్పాట్లలో హడావుడి ఏమీ లేదని... అంతా చట్టప్రకారమే జరుగుతోందని సర్కారు పేర్కొంది. అయితే వార్డుల విభజన చట్టబద్ధంగా జరగలేదని.. ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని పిటిషనర్ అంజు కుమార్ రెడ్డి రిప్లై కౌంటరు దాఖలు చేశారు. తన వాదనకు మద్దతుగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బండి సంజయ్ ప్రమాణపత్రాలను కూడా హైకోర్టుకు సమర్పించారు. మున్సిపాలిటీల అధికారులు తన అభిప్రాయాలను తీసుకోలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తన సంతకాన్ని అధికారులు ఫోర్జరీ చేశారని ఆరోపించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో 13 మున్సిపాలిటీలు ఉండగా.. వార్డుల విభజనపై పూర్తి వివరాలు సమర్పించక పోవడం వల్ల తన అభిప్రాయాలు ఇవ్వలేదని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో ఉన్న 17 మున్సిపాలిటీలకు 8 మాత్రమే అభిప్రాయాలను కోరాయని మిగతా వాటినుంచి వివరాలు రాలేదని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్రెడ్డి వివరించారు. వార్డుల విభజన చట్టబద్ధంగా జరగలేదని.. ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందనేందుకు ముగ్గురు ఎంపీల ప్రమాణపత్రాలే ఆధారమని పిటిషనర్ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి : బోనం ఎత్తిన జిల్లా విద్యాశాఖాధికారి