తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఆరో రోజున ఉదయం స్వామి వారు సర్వాలంకారభూషితుడై చంద్రప్రభపై దర్శనమిచ్చారు. శంఖు, చక్రం, గథ, అభయహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అవతారంలో భక్తులను కటాక్షించారు.
ఉదయం సూర్యప్రభ సేవ
ఉత్సవాల్లో ఏడో రోజున స్వామివారు ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవపై దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల మేరకు ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న తితిదే.. పాత వెండి సూర్యప్రభ వాహనంపై సేవను నిర్వహించారు.
నూతన వాహనం పెద్దగా ఉన్నందున..
నూతన వాహనాన్ని ఆలయంలోకి తరలించగా.. మహద్వారం కంటే పెద్దదిగా ఉండటం వల్ల వీలు పడలేదు. ఫలితంగా పాత వాహనంపైనే స్వామివారు ఆశీనులై దర్శనమిచ్చారు.
రాత్రి వైభవంగా చంద్రప్రభ సేవ
శుక్రవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. చల్లని వెన్నెల కురిసే సమయంలో చంద్రప్రభను అధిరోహించిన శ్రీవారు.. వెన్నముద్ద కృష్ణుడి అవతారంలో భక్తులకు కన్నుల విందుగా దర్శనమిచ్చారు.
శనివారం సర్వభూపాల, అశ్వవాహన సేవ
శనివారం ఉదయం సర్వభూపాల, సాయంత్రం అశ్వవాహన సేవపై స్వామివారు విహరించనున్నారు. ఆదివారం చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.