హైదరాబాద్లో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించేందుకు సర్కిళ్లవారీగా సర్వే చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. నగరంలోని 30 సర్కిళ్లలోని అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారులు తమ పరిధిలో గుర్తించిన శిథిలావస్థ భవనాలు కూల్చివేసేందుకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, నిర్మాణాలను ఖాళీ చేయించి, సీల్ చేయాలని తెలిపారు. అలాంటి భవనాల చుట్టూ బారీకేడింగ్ చేసి, ప్రజలు అటువైపు వెళ్లరాదని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
నాలుగేళ్లలో 1438 శిథిల భవనాలు తొలంగించినట్లు కమిషనర్ వెల్లడించారు. వర్షాకాలంలో కొత్తగా సెల్లార్ తవ్వకాలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే సెల్లార్ తవ్వకాలు జరిగి, పనులు పురోగతిలో ఉంటే నిర్ణీత ప్రమాణాల ప్రకారం నిర్మాణ ప్రదేశాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రిటైనింగ్ వాల్వ్ నిర్మించి బాకికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సెల్లార్ తవ్వకాలు జరిగినప్పటికీ పనులు ప్రారంభం కాకపోతే చుట్టుపక్కల నిర్మాణాలను తనిఖీచేసి వాటి రక్షణకు చర్యలు తీసుకొవాలని సూచించారు.
ఈ అంశంలో సహకరించని యజమానులకు నోటీసులు జారీచేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్, జూబీహిల్స్ లాంటి కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించి రిటైనింగ్ వాల్ నిర్మించాలని కమిషనర్ వివరించారు.