హైదరాబాద్ నగరంలో అధికారులు ఫీవర్ సర్వేను ముమ్మరంగా చేపట్టారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖకు చెందిన 641 బృందాలు ఇంటింటికీ తిరిగి జర్వం, కరోనా లక్షణాలున్న వారి వివరాలను సేకరించారు. ఒక్కో బృందంలో ఒక ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ వర్కర్‌తో కూడిన సభ్యులు థర్మోస్కానర్‌తో సర్వే చేశారు.
మంగళవారం ఒక్కరోజే సుమారు 40 వేల ఇళ్లల్లో సర్వే చేపట్టగా.. 1,487 మంది జ్వరంతో ఉన్నారని గుర్తించారు. వీరిలో 1,400 మందికి వెంటనే కొవిడ్ మందుల కిట్ అందజేశారు. జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు.
సోమవారం నుంచి నగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొన్నాయి. మంగళవారం ఈ బృందాల సంఖ్య 641కు పెరగడంతో.. ఒక్కరోజే 40 వేల ఇళ్లలో ఈ ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆస్పత్రుల్లో 18,600 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు..
నగరంలోని ప్రతి బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాల్లో కొవిడ్ అవుట్ పేషంట్‌కు పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని ఆస్పత్రుల్లో 18,600 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,600 మందికి స్వల్ప జ్వరాలు ఉన్నట్టు గుర్తించి.. వారికి కరోనా నివారణ మందుల కిట్లను అందజేశారు. తమ తమ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, ఆస్పత్రుల్లో జరిపిన ప్రాథమిక వైద్య పరీక్షలను సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు.