15వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు పంచాయతీల్లో గత ఏడాదికి సంబంధించి ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి ఆడిట్ అధికారులు గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించి అందులోని అభ్యంతరాలను వెల్లడించేవారు. ఈ ప్రక్రియలో రికార్డులు ఇవ్వకపోవడం తదితర సమస్యలు వచ్చేవి. పంచాయతీల్లో ఆడిటింగ్ వ్యవస్థను పక్కాగా అమలు చేయాలని, అనంతరం నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది.
బయటపడుతున్న లొసుగులు
దీనితో రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఆడిటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీల్లో ఇప్పటివరకు 3,277 ఆడిటింగ్ నివేదికలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో అనేక లొసుగులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 36 వేల అభ్యంతరాలను ఆడిటింగ్ విభాగం గుర్తించింది.
10వేలకు పైగా ఉల్లంఘనలు
జీఎస్‌టీ, ఆస్తిపన్ను, కార్మిక పన్ను, గ్రంథాలయ పన్ను, సీనరేజీ ఫీజులు ఇతరత్రా వసూలు చేసినప్పటికీ వాటిని పూర్తిగా జమచేయడం లేదని తేలింది. ఈ తరహా అభ్యంతరాలు అత్యధికంగా 16,848 నమోదయ్యాయి. పంచాయతీ నిధుల ఖర్చు, ఇతర విధుల నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు 10,500కు పైగా ఉన్నట్లు గుర్తించింది. కొన్ని పంచాయతీల్లో రిజిస్టర్లు, నిల్వలు, చేసిన పనులకు సంబంధించి అంచనాలు, చెల్లింపుల పుస్తకాలు, ఇతరత్రా దస్త్రాలు ఇవ్వలేదని ఆడిటింగ్ పేర్కొంది. ఇలాంటి అభ్యంతరాలు దాదాపు 3,589గా నమోదయ్యాయి.
ఇదీ చూడండి: భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం