రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని తెరాస కార్యానిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వివరించారు. దిశ ఘటన తర్వాత స్పందన ఎలా ఉందో చూశారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ సెయింట్ మెరీస్ ఫార్మా కళాశాలలో జరిగిన పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఒకప్పుడు తరచూ మహిళల బిందెల ప్రదర్శనలు చూశామన్న కేటీఆర్... ఇప్పుడు మహిళలు నీటి కోసం బయటకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఆరేళ్ల పాలన ఎలా ఉందో గమనించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరున్నరేళ్లలో మత ఘర్షణలు, కర్ఫ్యూలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేంద్రానికి రూపాయి ఇస్తే ఆఠాణా మాత్రమే తిరిగి వస్తోందని కేటీఆర్ అన్నారు. మిర్చి బండి కూడా ఉద్యోగమని ప్రధాని మోదీ.. ఓ సందర్భంలో అన్నారని... అట్లైతే మేము ఉద్యోగాల సంఖ్యను చెప్పుకోగలమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని తిడుతున్నారని... మేము కూడా మోదీని, అమిత్ షాను అనగలమని, గౌరవంతో ఆగుతున్నామని అన్నారు.
ఇదీ చదవండి: కార్మిక క్షేత్రంలో మగువ తెగువ... మరమగ్గంతో భర్తకు చేయూత