NOTA Votes in Telangana Assembly Elections 2023 : ఓటు వేయాలి.. కానీ బరిలో నిలిచిన అభ్యర్థులెవరూ నచ్చలేదు. కనీసం ఆ విషయాన్నైనా.. అధికారికంగా నమోదు చేసుకోవాలి. ఇలాంటి వారి కోసమే ఎన్నికల సంఘం అందించిన వజ్రాయుధం.. నోటా. తద్వారా ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న వారి సంఖ్య తగ్గించేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇది మామూలు ఆయుధం కాదు. అభ్యర్థుల తలరాతను తలకిందులు చేసే బలమైన అస్త్రం.
Telangana Assembly Elections 2023 : గత శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు.. 171 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కోవా లక్ష్మిపై గెలుపొందారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. నోటాకు పడిన ఓట్లు ఏకంగా 2,711. ధర్మపురిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. 441 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో నోటాకు పడిన ఓట్లు 2,597. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి లభించిన ఆధిక్యం 376 ఓట్లు. నోటాకు 1,145 ఓట్లు లభించాయి.
'నోటాకు మెజారిటీ వస్తే మళ్లీ ఎన్నిక!'
అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్.. 1016 ఓట్ల అధిక్యంతో.. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై గెలిచారు. ఇక్కడ నాలుగో స్థానంలో నిలిచిన నోటాకు.. 1,462 ఓట్లు వచ్చాయి. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్.. 756 ఓట్ల తేడాతో విజయం సాధిస్తే.. నోటాకు లభించిన ఓట్లు 1,240. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్.. సమీప ప్రత్యర్థి బానోత్ మదన్‌లాల్‌పై 2,013 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు లభించిన ఓట్లు 2,360. ఇలా నోటాకు పడిన ఓట్లు.. ఏ అభ్యర్థికి పడినా వారి తలరాతలు తలకిందులు అయ్యేవి. గెలుపోటములపై ప్రభావం చూపేవి.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో నోటా ఏ ఒక్కచోటా చివరి స్థానంలో నిలవలేదు. ఏకంగా 70 నియోజకవర్గాల్లో 5వ స్థానంలోపే దక్కించుకుంది. 2018 ఎన్నికల్లో మొత్తం ఓట్ల సంఖ్య 2 కోట్ల 56 లక్షలుంటే.. పోలైన ఓట్లు 2 కోట్ల 4లక్షలకు పైనే. అంటే 79.7 శాతం పోలింగ్ నమోదైంది. అందులో నోటాకు ఏకంగా 2 లక్షల 24 వేల709 ఓట్లు లభించాయి. అంటే దాదాపు 1.1 శాతం ఓట్లు నోటాకు దక్కాయి. ఒక్కశాతం ఓట్లే కదా అని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. ఒక్క ఓటు తేడా ఉన్నా సరే అభ్యర్థుల తరరాతలు మారిపోతాయన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం.
NOTA Votes in Telangana Assembly Elections 2018 : 2108 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలకంటే వర్ధన్నపేటలో అత్యధికంగా 5,842 ఓట్లు నోటాకు లభించాయి. అక్కడ నమోదైన ఓట్లలో ఇది ఏకంగా 3.09 శాతం. హుజురాబాద్‌లో నోటాది మూడోస్థానం. ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తర్వాత స్థానం నోటాదే. ఖమ్మం నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్, తెలుగుదేశం అభ్యర్థి నామా నాగేశ్వరరావు తర్వాత నోటాకే అధికంగా ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ రూరల్, జగిత్యాల, మంథని, అంధోల్, ఉప్పల్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, గోషామహల్ వంటి ఎన్నో స్థానాల్లో ప్రధాన పార్టీల తర్వాత స్థానం నోటాదే.
2009లో ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన నోటాను కేంద్రం ఆమోదించలేదు. 2013లో నోటాను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వినియోగించారు. అలా 2014 నుంచి నోటాకు ఓట్లేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ నోటాకు లభించిన ఓట్లు 0.69 శాతం. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ పోటీలో నిలబడిన అభ్యర్థులో.. రాజకీయాలు నచ్చకో.. చాలా మంది ఓటు వేయడం లేదు. నచ్చిన అభ్యర్థి లేకపోతే నోటాకు ఓటేసి.. హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు. వినియోగించుకోకుండా వృథా చేయడం కన్నా.. నోటాకు ఓటేసైనా సద్వినియోగం చేయాలన్నది నిపుణుల సూచన.
స్థిరంగా బీజేపీ ఓట్‌బ్యాంక్.. 4 శాతం పెరిగిన కాంగ్రెస్ ఓట్‌షేర్.. మరి నోటాకు ఎన్ని?