తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లు... 20 రోజుల్లోనే ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్దమవుతోంది. గత నెల 29న ముఖ్యమంత్రి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. కానీ ఈనెల 2 నుంచి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ఈనెల 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
సమస్యలు పరిష్కరించేందుకు
తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ... ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 18న నమూనా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 20 నమూనా రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. ఈ సందర్భంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆయా సబ్ రిజిస్ట్రార్‌కు అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలా రెండు, మూడు రోజులు చేయడం ద్వారా తప్పులు, పొరపాట్లను సవరించుకుని... చిన్నపాటి తప్పు కూడా జరగకుండా రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని... అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రోజుకు 70 నుంచి 80
సాధారణంగా కార్డ్ ద్వారా ఇప్పటి వరకు ఒక రిజిస్ట్రేషన్ పూర్తి కావాలంటే... క్రయ విక్రయదారులు తీసుకొచ్చే డాక్యుమెంట్ల అన్నీ సక్రమంగా ఉంటే... వాటిని పరిశీలన చేస్తారు. ఆ తరువాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను చదివి వారికి వినిపిస్తారు. విక్రయదారులు, కొనుగోలుదారుల ఇద్దరి అంగీకారంతో రిజిస్ట్రేషన్ తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ కార్డుల పరిశీలన, వేలిముద్రలు, ఫోటోలు తీసుకోవడం, డాక్యుమెంట్లకు సంబంధించి డేటా ఎంట్రీ చేయడం లాంటివి చేయాల్సి ఉండేది. ఇలా ఒక్కో రిజిస్ట్రేషన్‌కు 20 నిముషాలకు తక్కువ లేకుండా సమయం పట్టేది. అంటే రోజుకు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగేవి.
రాత్రి వరకు
ఇక రద్దీ అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ... వంద కూడా జరిగేవి. కానీ వాటికి చెందిన వివరాలు కంప్యూటర్‌లో ఎంటర్ చేయడం, ఇతరత్తర ప్రక్రియ సకాలంలో పూర్తి చేసేందుకు... రాత్రి వరకు పని చేయాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత... కొనుగోలుదారుడు ఆస్తి తన పేరున నమోదు కావడానికి మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
అయిదు నుంచి పది నిముషాల్లో
కానీ నూతన విధానంలో... అన్ని డాక్యుమెంట్లు ధరణి పోర్టల్లో అందుబాటులో ఉండడం, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా మళ్లీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందే స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు దారులు, విక్రయదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేందుకు అవకాశం ఉండడం వల్ల.. సబ్ రిజిస్ట్రార్ నిర్దేశించిన సమయానికి ఇద్దరు వస్తే కేవలం అయిదు నుంచి పది నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో సమయం ఆదా కావడంతోపాటు... రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా రోజుకు 70 నుంచి 80 పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. ఆ వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తవుతున్నందునా... ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే ఉండదు. రిజిస్ట్రేషన్లు సరళీకరణ కావడం వల్ల... అధికారులపై కూడా పని ఒత్తిడి తగ్గుతుందని... వివాదాస్పద ఇబ్బందులు ఉండవని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
కార్యాలయాలను ఎత్తివేసి
వ్యవసాయ రిజిస్ట్రేషన్లన్నీ రెవెన్యూ శాఖకు బదిలీ కావడం వల్ల... వ్యవసాయేతర ఆస్తులు ఒకట్రెండు రిజిస్ట్రేషన్లు కూడా జరగని... 20కిపైగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేయాలన్న ప్రతిపాదన ఉంది. అంటే 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 25 కార్యాలయాలను ఎత్తివేసి... వాటిని అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయ్యే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రోజుకు వంద, అంతకు మించి రిజిస్ట్రేషన్లు జరిగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాటిలో ఎన్నింటికి అధిక పని ఒత్తిడి ఉందో రిజిస్ట్రేషన్ల శాఖ పరిశీలన చేస్తోంది.
ఒత్తిడి తగ్గించేందుకు
ప్రధానంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో... ఆస్తుల వ్యాపారం ఊపందుకోవడం, వ్యవసాయ భూములు వ్యవసాయేతర ఆస్తులుగా మార్చి వెంచర్లు వేస్తుండడం వల్ల... ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అక్కడే జరుగుతున్నాయి. బండ్లగూడ, మహేశ్వరం, ఘట్కేసర్, సంగారెడ్డి, వరంగల్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పని ఒత్తిడి తగ్గించేందుకు కొత్తగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ... కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 23న ముందే అనుకున్న విధంగా ఆ రోజు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది.
ఇదీ చూడండి : దీపావళి రోజు ఆ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగింది