Nomination Process Started in Telangana 2023 : తెలంగాణ శాసన సభ సమరంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. శుక్రవారం ఉదయం ఎన్నికల అధికారులు గెజిట్ నోటిఫికేషన్(Gazette Notification) విడుదల చేశారు. అనంతరం 11 గంటలకు ఫారం-1 నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ప్రక్రియ నవంబర్ పదో తేదీ వరకు కొనసాగనుంది.
శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
Telangana Assembly Elections Nominations 2023 : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు(Independent Candidates) కలిపి 2,644 నామినేషన్లు నమోదయ్యాయి. ఈ దఫా అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆ నేరాల వివరాలను మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉన్న పక్షంలో అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో నామపత్రాలు పంపాల్సి ఉంటుందని తెలిపింది.
Telangana Assembly Elections Nominations 2023 : ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలను ప్రారంభించి.. రెట్టింపు వేగంతో దూసుకువెళ్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా సంసిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 6,8వ తేదీలు మంచి రోజులని.. ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్రవారంతో పాటు ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీలలో భారీ సంఖ్యలో అభ్యర్థులు నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఈ నెల 6వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు చేయనున్నారు.
నామినేషన్ వేసే అభ్యర్థులు తప్పక పాటించాల్సిన సూచనలు ఇవే..
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు
- కేంద్రం వెలుపల రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు.. వాహనాలకు నో ఎంట్రీ
- ఆర్వో కార్యాలయం 100 మీటర్ల పరిధిలోకి 3 వాహనాలకే అనుమతి
- రిటర్నింగ్ అధికారి గదిలోకి నామినేషన్ అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే అనుమతి
- సువిధ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ నామినేషన్లకు కూడా అవకాశం
- అభ్యర్థి నామినేషన్‌తో పాటు అన్ని వివరాలు తెలిపే అఫిడవిట్ తప్పనిసరి
- విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర వివరాలతో అఫిడవిట్ తప్పనిసరి
- ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తప్పనిసరి
- ఆన్‌లైన్ నామినేషన్ వేస్తే ప్రింటెడ్ కాపీ ఆర్వోకు సమర్పించడం తప్పనిసరి