హైదరాబాద్ మహానగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన సమస్య ఎప్పట్నుంచో వేధిస్తోంది. కోటి జనాభాకి కేవలం 350 నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు సర్కారు ఆగస్టు 15 నాటికి 3 వేల ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఆరుగురు జోనల్ కమిషనర్లకు 500 చొప్పున అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖ లక్ష్యం నిర్దేశించింది. కరోనా కారణంగా ఆశించిన స్థాయిలో పురోగతి చూపించలేకపోయినట్లు కేంద్ర కార్యాలయం చెబుతోంది. ఇప్పటికీ 20 శాతం నిర్మాణాలకు స్థలం గుర్తించలేదంటోంది. 80 శాతం నిర్మాణాలు మొదలయ్యాయని, అందులో ఎల్బీనగర్, కూకట్‌పల్లి జోన్‌లు ముందున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆ జోన్లలో 200కుపైగా మరుగుదొడ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండటం గమనార్హం. మొత్తం 3 వేల నిర్మాణాల్లో 40 శాతం పర్యావరణహితం. 20 శాతం బిల్డ్ ఓన్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) విధానంలో నిర్మించి స్థానికులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. మిగిలిన వాటిని ఏజెన్సీలకు ఇస్తామన్నారు. రోజుకు రెండు లేదా మూడుసార్లు మరుగుదొడ్లను శుభ్రం చేసేలా నిబంధన ఉంటుందన్నారు. అందులో 50 శాతం నిర్మాణాలు మహిళల నిర్వహణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'