దుర్గం చెరువు కేబుల్ వంతెనపైకి వారాంతాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుండటంతో సమస్య తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం రాత్రి 10గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించారు.
వంతెనపై సందర్శకుల తాకిడి పెరగడంతో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలపై సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ, రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో కలిసి చర్చించారు.
పాదచారుల బాటని విస్తరించేలా..
ఐటీసీ కోహినూర్‌తో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం-45 వైపు నుంచి వంతెనపైకి వాహనాలతో సందర్శకులు వస్తుంటారు. దీంతో ఇరువైపులా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సజ్జనార్ సూచించారు. వంతెనపై సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎస్బీఐ కూడలి వరకు వేగ నియంత్రికలను ఏర్పాటు చేయడంతో పాటు డీమార్ట్ వద్ద యూటర్న్‌ని మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వంతెనపై పాదచారుల బాటను మరింత విస్తరించాలని నిర్ణయించారు.