కరోనాతో దీర్ఘకాల వ్యాధులున్న రోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వైరస్ భయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల జూనియర్ డాక్టర్లు రెండు, మూడు గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్రంలో తొలి కేసు మార్చి2న నమోదు కాగా, అనంతర పరిణామాలతో ప్రైవేటు ఆసుపత్రులు క్రమేణా ఓపీ సేవలను, ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్వహించే శస్త్రచికిత్సలను నిలిపివేశాయి. అధిక శాతం ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను మాత్రమే అందిస్తుండగా.. కొన్ని చోట్ల వాటినీ తిరస్కరిస్తున్నారు.
ఈ తరహా ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్.. దీన్ని చక్కదిద్దడానికి అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేశారు. దీర్ఘకాల రోగులను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వైద్యానికి ఆటంకం కల్పించొద్దని ఆదేశించారు.
గుమిగూడకుండా ఉంచడం సాధ్యమేనా?
- ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంల్లో సాధారణంగా వైద్యుల గదుల ముందు పదుల సంఖ్యలోనే వరుసగా కూర్చుంటారు.సంప్రదింపుల సమయంలో వైద్యుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. గది బయట కూర్చునే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేదిప్రశ్నార్థకంగా మారింది.
- కరోనా లక్షణాలు బయట పడని రోగి ఓపీకి వస్తే ఎలా? వారి ద్వారా మరికొందరికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే ఆందోళన కూడా ఆసుపత్రి వర్గాల్లో ఉంది.
- తక్కువ స్థలంలో ఎక్కువమంది గుమిగూడకుండా చూడడం ఎంత మేరకు సాధ్యమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓపీని నిర్వహించకపోవడమే మేలని కొందరు ప్రైవేటు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
- లాక్‌డౌన్ ఎత్తివేసినా కూడా ఇదే సమస్య తలెత్తుతుంది. అప్పుడేం చేయాలన్న దానిపై కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నాయి.
- రోగులకు కేటాయించిన ఓపీ సమయాల్లోనే వైద్యుని సంప్రదింపులు నిర్వహించాలని, ఓపీ సేవలకు అధిక ప్రాధాన్యమిచ్చి, నిర్దేశిత సమయంలోగా అందరినీ చూసి త్వరగా పంపించాలని యోచిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రానంత వరకూ ఓపీ సేవల్లో సందిగ్ధత తప్పదని ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఎండీ తెలిపారు.
కరోనా వైరస్ సోకని సాధారణ రోగులకు వైద్యసేవలందించడంలో ఎటువంటి ఆటంకాలూ కల్పించొద్దు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. డయాలసిస్, క్యాన్సర్, రక్తమార్పిడి, ప్రసవం తదితర అత్యవసర చికిత్సలను కూడా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తిరస్కరించడం సరికాదు.
- ప్రీతిసుడాన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి
ప్రైవేటులో ఓపీ సేవలకు ఎటువంటి అడ్డంకులు లేవు. జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం కొనసాగించవచ్చు.
- ఈటల రాజేందర్, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి